Friday 9 November 2012

ఢిల్లీ వెళితే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్టా?

"అమ్మా, వదిన ఢిల్లీ వెళితే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్టా?" అని జగన్ సోదరి షర్మిల ప్రశ్నించారు . ‘మాట ఇవ్వడమంటే, దానిపై నిలబడడమంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చే సి ప్రభుత్వంతో కుమ్మక్కయి అబద్ధపు కేసులు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. పైగా వాళ్లంటారు జగనన్న కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారట. అందుకే అమ్మ, వదిన ఢిల్లీ వెళ్లారట. అసలు మీరు మనుషులా? మా లాయర్లు ఢిల్లీలో ఉంటే వారిని కలవడానికి వెళితే కూడా కుమ్మక్కయినట్టా? అలా కుమ్మక్కయి ఉంటే జగనన్న ఎప్పుడో కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారు. కుమ్మక్కయ్యింది మీరు.. అందుకే మీపై కేసులు ఉండవు. విచారణ ఉండదు. అందుకు ప్రతిఫలంగా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతారు.’’ అని బాబుపై షర్మిల నిప్పులు చెరిగారు.  ‘‘దారిలో ఓ టమాటా రైతును కలిశాను.. తాను పండించిన టమాటాలను కింద పారబోశాడు. కారణం.. దానికి ధర రాదట. కిలో ఒక్క రూపాయి వస్తుందట. ఈమాత్రం దానికి ఇంత తీసుకెళ్లి అమ్మడం ఎందుకని పారబోశామని చెప్పాడు. మనసుకు చాలా బాధేసింది. చాలా కష్టమనిపించింది. రాజన్న రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చి, కరెంటు ఇచ్చి, గిట్టుబాటు ధర ఇచ్చి, దురదృష్టవశాత్తూ పంట నష్టపోతే పరిహారం ఇచ్చి రైతన్నకు అండగా నిలబడ్డాడు. కానీ వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతన్నను గాలికి వదిలేసింది. కడుపు మీద కొట్టి వేడుక చూస్తోంది’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.సాయంత్రం 4.40కి మద్దికెర సమీపంలో కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన  షర్మిలకు వేలాదిగా ఆ జిల్లా ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.షర్మిలను చూడాలని, పాదయాత్రలో కదం తొక్కాలని యువతీయువకులు, మహిళలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షర్మిల జిల్లాలోకి అడుగు పెట్టిన ప్రాంతం నుంచి సభ ప్రాంతానికి వెళ్లడానికి మధ్య దూరం 3 కిలోమీటర్లు. అడుగు తీసి అడుగు వేయడానికి వీల్లేనంతలా జనం పోటెత్తడంతో ఆమె సభ ప్రాంతానికి చేరుకోవడానికి రెండుగంటలు పట్టడం గమనార్హం. స్వాగతం పలికేందుకు తరలివచ్చిన నేతల్లో వైఎస్‌ఆర్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, జి.జయరామ్, పార్టీ నేతలు బుడ్డా శేషురెడ్డి, కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి, జయంతి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...