
టీడీపీ అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన మాటలను ఆయన పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదని షర్మిల విమర్శించారు. శనివారం సాయంత్రం 5.10కి పత్తికొండ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న షర్మిల అక్కడికి భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘మేం గర్వంగా చెప్పగలుగుతాం. రాజన్న రాజ్యం మళ్లీ తెస్తామని. కానీ చంద్రబాబు చేసింది చెప్పుకోలేకపోతున్నారు. పైగా రాజశేఖరరెడ్డిలా అన్ని పథకాలూ అమలు చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. కానీ ఆయన మాటలను ఆ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదు. అందుకే వాళ్లు మా పార్టీలోకి వస్తున్నారు. చంద్రబాబుకు పాదయాత్ర అవసరమే లేదు. అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు ఆయనకు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆయన పెట్టరు. ఎందుకు పెట్టరో చెప్పరు’’ అని విమర్శించారు. ‘ రెండెకరాల చంద్రబాబు ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారని కమ్యూనిస్టులు పుస్తకం ప్రచురించినా.. దానిపై విచారణ ఉండదు. అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని తెహల్కా వెబ్‌సైట్ ప్రచురించినా.. విచారించరు. ఎకరా రూ. 2 కోట్ల విలువ చేసే భూములను ఎకరా రూ. 50 వేలకే తన బినామీ సంస్థ అయిన ఐఎంజీకి కట్టబెట్టినా.. ఆయన్ను విచారించరు. ఎందుకు విచారణ చేయరని మనం కేసు వేస్తే కోర్టులో జడ్జి గారు కూడా ఎందుకు చేయరని సీబీఐని ప్రశ్నించారు. కానీ సీబీఐ సిబ్బంది లేరని చెప్పింది. జగనన్న మీద, ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్ల మీద దాడులు జరపడానికి సిబ్బంది ఉంటారు. కేవలం ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికే 2 వేల మంది సిబ్బందిని పెట్టారు. కానీ చంద్రబాబుపై విచారణ చేయడానికి వాళ్లకు సిబ్బంది ఉండరు.’’ అని ఆమె దుయ్యబట్టారు.
No comments:
Post a Comment