Saturday 3 November 2012

వైఎస్‌ను గౌరవించేలా సర్కార్ ఏ ఒక్క పని చేయడం లేదు

  వైఎస్ తనయ షర్మిలకు జోరు వానలోనూ బ్రహ్మరథం పట్టారు. జడివానలోనూ తన అడుగులో అడుగు వేస్తూ కదంతొక్కుతున్న జనాన్ని చూసి షర్మిల పులకించిపోయారు. పండుటాకులను ఆత్మీయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు ఓపికతో సావధానంగా వింటూ.. మహిళలతో మమేకమవుతూ.. విద్యార్థులకు భవిష్యత్‌పై ధీమా కల్పిస్తూ.. రైతన్నకు ఆత్మస్థైర్యం కల్పిస్తూ షర్మిల ముందుకు సాగారు. భంభంస్వామి గుట్ట నుంచి 205 జాతీయ రహదారి మీదుగా నడుస్తూ.. హెచ్చెల్సీ-మిడ్ పెన్నార్ లింక్ కెనాల్ వద్దకు షర్మిల చేరుకున్నారు. అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. ‘అమ్మా.. ఎంపీఆర్ ఆయకట్టుకు ఖరీఫ్‌లోనే నీళ్లివ్వాల్సింది. కానీ.. ఇప్పుడు రబీలో ఇస్తున్నారు. హెచ్చెల్సీ కోటా డిసెంబర్ మొదటి వారంతోనే పూర్తి కానుంది. జనవరి 15 వరకు రబీకి నీళ్లిస్తామంటున్నారు. 75 రోజులు నీళ్లిస్తే ఏం పంట పండించుకోవాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘జిల్లా పరిస్థితులను గమనించే  వైఎస్ పీఏబీఆర్‌కు పది టీఎంసీల నీళ్లు కేటాయించారు. హెచ్చెల్సీకి కేటాయించిన నీటిని ఖరీఫ్‌లోనే రప్పించుకునేలా చేసి ఆయకట్టుకు నీళ్లందించేవారు. పీఏబీఆర్‌కు కేటాయించిన నీటిని తాగునీటి కోసం, చెరువులకు నీళ్లు నింపడం కోసం వినియోగించేవారు. అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు పీఏబీఆర్‌కు నీటి కోటాను ఈ ప్రభుత్వం రద్దు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జగనన్న సీఎం అయ్యాక టీబీ డ్యామ్ నుంచి సమాంతర కాలువ తవ్వించడానికి పోరాటం చేస్తాం.. తద్వారా వరద వచ్చినప్పుడు ఆ నీటిని జిల్లాకు మళ్లించి సస్యశ్యామలం చేస్తాం’ అంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత పెన్నఅహోబిలం చేరుకున్న షర్మిల అక్కడ  
రోడ్డు పక్కన ఉన్న గుట్టపై ఉన్న ఓ గుండుపై కూర్చొని ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ‘అమ్మా.. వర్షభావ పరిస్థితుల వల్ల ఎలాంటి సేద్యపు పనులు లేవు. ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పని కల్పిస్తామని చెప్పి.. కేవలం 20 నుంచి 30 రోజులే పని కల్పిస్తున్నారు. రోజు వారి కూలీ రూ.60 కూడా గిట్టుబాటు కావడం లేదు. అదే వైఎస్ ఉన్నప్పుడు ఏడాదికి వంద రోజులు పని కల్పించేవారు. రోజు వారీ కూలీ రూ.100 నుంచి రూ.120 వరకు గిట్టుబాటయ్యేది. అప్పుడు కూలీ కూడా ఎప్పటికప్పుడు చెల్లించేవారు. కానీ.. ఇప్పుడు సక్రమంగా చెల్లించడం లేదు’ అని మోపిడికి చెందిన ఓ మహిళ షర్మిలకు విన్నవించుకుంది. రాకెట్లకు చెందిన ఓ వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘అమ్మా నాకు ఇప్పుడు పెన్షన్ రావడం లేదు. వైఎస్ ఉన్నప్పుడు ప్రతి నెలా రూ.200 చొప్పున వచ్చేది.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాథులే లేరు’ అంటూ షర్మిలకు తన బాధను చెప్పుకుంది. ‘అమ్మా.. మాకు కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. సాగునీళ్లు దేవుడెరుగు.. తాగునీళ్లే లేవు’ అంటూ మోపిడికి చెందిన మరో మహిళ విలపించింది. ఇందుకు షర్మిల స్పం దిస్తూ.. ‘సీఎం కిరణ్ మొద్దునిద్ర పోతున్నారనడానికి మీ సమస్యలే నిదర్శనం. వైఎస్ రెక్కల కష్టంపై అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వైఎస్‌ను గౌరవించేలా ఏ ఒక్క పని చేయడం లేదు. సర్‌చార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు మోతెక్కిస్తున్నారు. అన్ని చార్జీలు పెంచి.. దగా చేస్తున్నారు. పజావంచక ప్రభుత్వాన్ని గద్దెదింపకుండా.. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టకుండా పాదయాత్ర అంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి.. ప్రతి పక్షానికి తగిన రీతిలో బుద్ధిచెప్పండి.. రాజన్న రాజ్యం వస్తుంది. సేద్యానికి ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్‌ను జగనన్న ఇస్తారు. వికలాంగులకు రూ.వెయ్యి, వృద్ధులకు రూ.700 చొప్పున పెన్షన్ ఇస్తారు. అమ్మ ఒడి పథకం కింద పదో తరగతి వరకు చదవుకునే పిల్లలకు రూ.500 చొప్పున, ఇంటర్ వరకు రూ.700, డిగ్రీ వరకు రూ.వెయ్యి చొప్పున వారి తల్లుల అకౌంట్లలో ప్రతి నెలా జమా చేస్తారు. వైఎస్ చేపట్టిన ప్రతి పథకాన్ని అమలుచేస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కంది చేనులోకి వెళ్లారు. ఆ పొలంలో ఉన్న రైతు లక్ష్మిదేవిని సమస్యలపై ఆరా తీశారు. ‘అక్కా.. ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశావు. పంట పరిస్థితి ఎలా ఉంది’ అంటూ ఆత్మీయంగా అడిగారు. ఇందుకు లక్ష్మిదేవి స్పందిస్తూ.. ‘అమ్మా గతంలో తొమ్మిది బస్తాల వేరుశనగ విత్తనాలు విత్తేవాళ్లం. గతేడాది వేరుశనగ పంట వల్ల నష్టపోయాం. అందుకే ఈ ఏడాది మూడు బస్తాల వేరుశనగ విత్తనాలు విత్తాం.. మరో పదెకరాల్లో కంది పంట సాగుచేశాం. ఇప్పుడు రెండు పం టల పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు’ అంటూ విలపించింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ఈ ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అమ్మా.. అధైర్యపడొద్దు.. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న రైతులను ఆదుకుం టారు’ అంటూ ఆమెలో ఆత్మస్థైర్యం నింపారు. నడవడానికి వీలుకాని దారిలోనూ.. కోనాపురం క్రాస్ వద్ద భోజనం చేసి కాసేపు విరామం తీసుకున్న షర్మిల జోరు వానలో మధ్యాహ్నం 3.10 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. కోనాపురం క్రాస్ నుంచి కోనాపురం చేరుకునే దారి వర్షం వల్ల నడవడానికి కూడా వీలు లేకుండా బురదమయంగా మారిపోయింది. ఆ దారిలోనే షర్మిల వడివడిగా నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కోనాపురం చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు జోరువానలోనూ నీరాజనాలు పలికారు. ఆ గ్రామ ప్రజలను ఆత్మీయంగా పలకరించిన షర్మిల అక్కడి నుంచి బురదమయంగా మారిన దారి గుండా షేక్షానుపల్లికి చేరుకున్నారు. షేక్షానుపల్లికి చేరుకునే క్రమంలోనే వర్షం జోరు పెరిగింది. వర్షంలో తడుస్తూనే షేక్షానుపల్లికి చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామ ప్రజలను ఆత్మీయంగా పలకరించిన షర్మిల.. వర్షంలోనూ తన కోసం వేచి చూస్తున్నందుకు మీ అభిమానాన్ని మరువలేమని అన్నారు. ‘ఈ రోడ్లను చూస్తుంటే మీ కష్టాలు నాకు అర్థమవుతున్నాయి.. జగనన్న సీఎం అవగానే మీ గ్రామాలకు రోడ్లు వేయించి.. బస్సులు నడిచేలా చూస్తాం’ అంటూ హామీ ఇవ్వడంతో షేక్షానుపల్లి ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు.ఆ గ్రామ ప్రజల నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం లత్తవరం శివారుకు 5.40 గంటలకు చేరుకుని అక్కడే రాత్రి బస చేశారు. శుక్రవారం పాదయాత్రలో 12.5 కిలోమీటర్ల మేర నడిచారు షర్మిల వెంట వైఎస్సార్‌సీసీ సీజీసీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆర్‌కే రోజా, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, నాయకురాలు కొల్లి నిర్మలాకుమారి, ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, శోభా నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, కిసాన్‌సెల్ కోఆర్డినేటర్ వై.మధుసూదన్‌రెడ్డి, సీజీసీ సభ్యులు తోపుదుర్తి కవిత, గిర్రాజు నగేష్, మాజీ ఎమ్మెల్యేలు కడపల మోహన్‌రెడ్డి, ఎం.ప్రసాదరాజు, నాయకులు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, సాలార్‌బాష తదితరులు పాల్గొన్నారు.

Friday 2 November 2012

వర్షం లోను ఆగని యాత్ర

‘జన’ తుపాను ముందు ‘నీలం’ తుపాను చిన్నబోయింది.  షర్మిల వెంట ప్రజలు తండోపతండాలుగా కదం తొక్కుతుండటంతో జన తుపాను బలబడుతూ కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో ప్రళయం సృష్టిస్తోంది.  వైఎస్ తనయ, జగన్‌ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు గురువారం ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలం ముద్దలాపురం, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేటల్లో జనం పోటెత్తారు. నీలం తుపాన్ ప్రభావం వల్ల జోరుగా వర్షం కురిసినా జనం చెక్కుచెదరలేదు. సరి కదా సమయం పెరిగే కొద్దీ జనం రెట్టింపై షర్మిల వెంట అడుగులో అడుగేసి కదంతొక్కారు. బుధవారం రాత్రి కూడేరుకు నాలుగు కిమీలోమీటర్ల దూరంలో బస చేసిన షర్మిల గురువారం ఉదయం 11 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించే సరికి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. ముద్దలాపురం శివారులో ఇద్దరు మరుగుజ్జు మహిళలను అప్యాయంగా పలకరించిన షర్మిల.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ‘అమ్మా.. అధైర్యపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు నెలకు రూ.వెయ్యి చొప్పున వికలాంగులకు పెన్షన్ వస్తుంది’ అంటూ ధైర్యం చెప్పడంతో వారి కళ్లలో వెలుగులు నిండాయి. ముద్దలాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన షర్మిల.. విద్యార్థులతో మమేకమయ్యారు. బాగా చదువుకోవాలని సూచించారు.ఆ తర్వాత ముద్దలాపురం చేరుకున్న ఆమెకు జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా హారతులు పట్టి.. గుమ్మడికాయతో దిష్టితీసి, ఇంటి బిడ్డలా ఆదరించడంతో షర్మిల ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ‘వేరుశనగకు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైఎస్ ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా పంటల బీమా వల్ల పంట పండకపోయినా నష్టపరిహారం వచ్చేది. గ్రామాల్లో జ్వరాలు పెరిగిపోయాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల లోగిల్లలో పంట దిగుబడులు లేవు.. అప్పులే మిగిలాయి’ అంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘పాలక, ప్రతిపక్షాలు దొందూ దొందే. కొద్ది రోజులు ఓపిక పట్టండి. జగనన్న సీఎం అవుతారు. మీ కష్టాలను కడతేర్చుతారు’ అంటూ భరోసా ఇచ్చారు.
ముద్దలాపురం గ్రామం నుంచి వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న షర్మిల అక్కడే భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే పాదయాత్రను కొనసాగించారు. జల్లిపల్లి శివారులో గొర్రెల కాపరులతో ముచ్చటించారు. ‘అమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు గొర్రెకు రూ.18 చొప్పున కట్టించుకుని బీమా సౌకర్యం కల్పించేవారు. గొర్రె చనిపోతే నష్టపరిహారం ఇచ్చేవారు. గొర్రెలకు మందులు కూడా వేసేవారు. కానీ.. ఇప్పుడు బీమా రద్దు చేశారు.
మందులు వేయడం లేదు. ఒక్క గొర్రె చనిపోతే ఆరేడు వేల రూపాయల నష్టం వస్తోంది. అదే బీమా ఉంటే మాకు ఆ నష్టం జరిగేది కాదు’ అంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘కులవృత్తులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. టీడీపీ కూడా ప్రభుత్వానికే వంతపాడుతోంది. జగనన్న సీఎం అవుతారు.. కులవృత్తులకు పెద్దపీట వేస్తారు. రాజన్న చేపట్టిన పథకాలను మళ్లీ చేపట్టి ఆదుకుంటారు’ అనడంతో గొర్రెల కాపర్ల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.అక్కడి నుంచి జల్లిపల్లికి చేరుకున్న షర్మిల బహిరంగ సభలో ప్రసంగించారు. ‘జగనన్న రైతుల కోసం, విద్యార్థుల కోసం.. చేనేతల కోసం దీక్షలు చేశారు. పోరాటాలు చేశారు. వైఎస్ తరహాలోనే ప్రజల పక్షాన పోరాడి.. జనం హృదయాలను గెలుచుకున్నారు. దీన్ని చూసి ఓర్వలేక.. కాంగ్రెస్, టీడీపీలకు ఉనికి ఉండదనే భయంతోనే జగనన్నను సీబీఐతో అరెస్టు చేయించాయి. చివరకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నాయి. దేవుడనేవాడు ఉన్నాడు. న్యాయం జరుగుతుంది. జగనన్న బయటకు వచ్చి.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు’ అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. జల్లిపల్లి సభ తర్వాత ఉదిరిపికొండకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ గ్రామంలో రచ్చబండ నిర్వహించి.. సమస్యలు తెలుసుకున్నారు. ఉదిరిపికొండ రైతులు మాట్లాడుతూ ‘వైఎస్ హయాంలో 99 శాతం పంట నష్టపరిహారం వచ్చింది. దీని వల్ల అప్పులు తీరాయి. కానీ.. ఇప్పుడు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. రైతులు ఎలా బతకాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘వైఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేశారు. జగనన్న అదే తరహాలో పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మంచి రోజులు వస్తాయి’ అంటూ భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.
ఉదిరిపికొండ నుంచి శివరాంపేటకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. షర్మిలపై బంతిపూల వర్షం కురిపించారు. అక్కడ గ్రామీణుల సమస్యలను తెలుసుకున్న తర్వాత షర్మిల మాట్లాడుతూ.. ‘జగన్ కాంగ్రెస్‌లో ఉంటే ఇన్ని కష్టాలు పడి ఉండేవారు కాదని గులాంనబీ ఆజాద్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కక్ష సాధింపుల్లో భాగంగానే జగనన్నను అరెస్టు చేయించారన్న విషయం అర్థమవుతోంది.టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ జగనన్నను ప్రజలకు దూరం చేస్తోంది. జగనన్నకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ కుట్రలు చేస్తున్నారు. ఏదో ఒక రోజు జగనన్న బయటకు రాకపోరు.. మీ తరఫున పోరాటం చేయకపోరు.. రాజన్న రాజ్యాన్ని స్థాపించకపోరు.. మీ కష్టాలను కడతేర్చకపోరు.. ఓపికపట్టండి’ అంటూ ధైర్యం చెప్పారు. శివరాంపేట నుంచి భంభంస్వామి గుట్ట వద్దకు రాత్రి 7.30 గంటలకు చేరుకున్న షర్మిల అక్కడే బస చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనూ వేలాది మంది ప్రజలు షర్మిలను అనుసరించడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇది కాంగ్రెస్, టీడీపీ శిబిరాలను మరింత ఆందోళనకు గురిచేసింది. గురువారం పాదయాత్రలో షర్మిల 13 కిలోమీటర్ల దూరం నడిచారు.

Tuesday 30 October 2012

బాబుది మాటమీద నిలబడే నైజం కాదు.....షర్మిల

రాజన్న, జగనన్నలకు ఉన్నది.. టీడీపీ అధినేత చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత, మాటమీద నిలబడే నైజం అని షర్మిల పేర్కొన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 12వ రోజు సోమవారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘‘చంద్రబాబుకు అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే శక్తి టీడీపీకి ఉంది. వైఎస్సార్‌సీపీ కూడా మద్దతు ఇస్తామంటున్నా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరట. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయి. సీబీఐని వాడుకుని విచారణ పేరుతో జగనన్నను బందీని చేశారు. వారి లక్ష్యం ఒక్కటే. జగనన్న బయటే ఉంటే ప్రతి సమస్యకూ స్పందిస్తాడు. రేయనక పగలనక మీ మధ్య ఉంటాడు. మీ ప్రేమ, ఆప్యాయతలు పొందుతాడు. కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు. ఇలాగైతే తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని వారు జగనన్నను దోషిగా చిత్రీకరించారు. జైల్లో పెట్టారు. కానీ దేవుడున్నాడు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన నిలబడతాడన్నదీ అంతే నిజం. అధర్మానికి ఆయుష్షు తక్కువ’’ అన్నారు.
‘‘కరువు జిల్లా అని అనంతపురంపై ప్రత్యేక శ్రద్ధతో రాజన్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని 4 వేల కోట్ల రూపాయలతో చేపట్టి 95% పనులు పూర్తిచేస్తే.. ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం 5% కూడా పూర్తిచేయలేకపోయింది. ఇంకో రూ.45 కోట్లు వెచ్చిస్తే మొదటి విడత పనులు పూర్తవుతాయి. ఈ పనుల కోసం మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేసి పూర్తి చేస్తారట. సొమ్మొకరిది.. సోకొకరిది అన్న చందంగా ఉంది ఆయన కథ. పోనీలెండి. ఆ పనులైనా పూర్తిచేస్తే సంతోషమే..’’ అని షర్మిల విమర్శించారు.  ‘‘జగనన్న అధికారంలోకి వస్తే పెద్ద చదువులకు ఇక ఆటంకం ఉండదు. ప్రతి మహిళా తన పిల్లలను బడికి పంపేందుకు వీలుగా ‘అమ్మ ఒడి’ ద్వారా తల్లి బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ.500, ఇంటరైతే రూ.700, డిగ్రీ అయితే రూ.1,000 వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 పింఛన్ ఇస్తాడు. రాజన్న చెప్పినవీ చేశాడూ.. చెప్పనివీ చేశాడు. జగనన్న కూడా మాట మీద నిలబడే మనిషి. చెప్పినవే కాకుండా ప్రజల అవసరాలను గమనించి అన్నీ సమకూరుస్తాడు. మైనారిటీలకు వీలైనంత ప్రయోజనం కల్పించాలన్నదే వైఎస్ లక్ష్యం. అదే లక్ష్యంతో జగనన్న పనిచేస్తాడు..’’ అని చెప్పారు.కోటి ఎకరాలకు నీరివ్వాలన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలను జగనన్న సాకారం చేస్తాడని చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి, రైతన్న గిట్టుబాటు ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాడని పేర్కొన్నారు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తాడని అన్నారు.
బహిరంగ సభలో లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ కారణజన్ముడని పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలు రుద్దే నేతలు మనల్ని పాలించడం సరికాదన్నారు. డిసెంబర్‌లోగా జగన్ బయటికి వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, ఢిల్లీలో కూడా కాంగ్రెస్, బీజేపీల తరువాత 35 ఎంపీ స్థానాలతో అతి పెద్ద పార్టీ వైఎస్సార్‌సీపీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Monday 29 October 2012

కాంగ్రెస్‌, టిడిపిలకు జగన్‌ అంటే గుబులు

కాంగ్రెస్‌, టిడిపిలకు వైఎస్‌ జగన్‌ అంటే గుబులు పుట్టుకుందని, అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, ఆ పార్టీలకు ప్రజలు గుణపాఠం నేర్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన ఆమె పలు చోట్ల మాట్లాడారు. రాప్తాడు వద్ద రాత్రి జరిగిన బహిరంగసభలో షర్మిల, ఆమె తల్లి విజయమ్మలు మాట్లాడారు. రాజశేఖర్‌రెడ్డి బతికున్న కాలంలో రాష్ట్రంలో రైతులు, చేనేతలు, మహిళలు, విద్యార్థులు అన్ని రకాల బాగుపడ్డారని గుర్తుచేశారు. రాజన్న మృతిచెందిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ జగన్‌పై వ్యక్తిగతంగా కక్ష పెంచుకుందని, అక్రమకేసులు బనాయించి జైలుకు పంపిందని ఆరోపించారు. అధికార పక్షంతో ప్రతిపక్ష పార్టీ కూడా కుమ్మక్కయిందని విమర్శించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విద్యుత్‌ ఛార్జీలు చెల్లించని పేదరైతులపై కేసులు బనాయించి జైలుకు పంపారని, బియ్యం ధర పెంచారని, బెల్ట్‌ షాపుల సూత్రధారి అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు అమలుకు నోచుకోని హామీలిస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. "మనసులోమాట "పుస్తకంలో చంద్రబాబు నిజాలను రాసుకున్నాడని చెప్పారు. రాజన్న రాజ్యంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ఉంటుందని, వడ్డీలేని రుణాలిస్తామని, జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని షర్మిల వివరించారు. జగన్‌ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఉచిత విద్యుత్‌ అందకుండా పోయిందని, పావలావడ్డీ అందటం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని, పింఛన్లు, రేషన్‌కార్డుల్లో కోతలు పెట్టారని ఆవేదన చెందారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు మరికొన్ని రోజులు బెయిలు రాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని, ఇందుకు సాక్ష్యంగా కేంద్ర  మంత్రి చిదంబరాన్ని టిడిపి ఎంపిలు కలవడమే నిదర్శనమన్నారు. జగన్‌ బయటికి వస్తే తమ ఉనికి ఉండదనే భయంతో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో వారికి గుణపాఠం చెప్పాల్సిందిగా ప్రజలను  కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు తోపుదుర్తి కవిత, శంకరనారాయణ, విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి భాస్కరరెడ్డి, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sunday 28 October 2012

సర్కార్ నిద్ర పోతోంది ....షర్మిల


  పదోరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తన ముందు గోడు వెళ్లబోసుకున్న అనంతపురం జిల్లా రైతులకు షర్మిల భరోసానిచ్చారు. జ్వరం కారణంగా షర్మిల కాస్త అస్వస్థతకు గురయ్యారు. అయినా ఉదయం 10.30కు పాదయాత్రకు బయలుదేరారు. డన్నపల్లి క్రాస్ సమీపంలో చెన్నారెడ్డి అనే రైతు వేరుశనగ పంటను పరిశీలించారు. తాను పూర్తిగా నష్టపోయానని ఆ రైతు మొరపెట్టుకున్నారు. భార్య తాళిబొట్టును కూడా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చానని, ఐదెకరాల్లో 60 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేస్తే ఇప్పుడు పంటకు రూ. 15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంతకుముందు మండలం యూనిట్‌గా పంట బీమా అందేదని, ఇప్పుడు దాన్ని తీసేసి వాతావరణ ఆధారిత బీమా అని ఇస్తున్నాని చెప్పారు. దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘రాజన్న ఉన్నప్పుడు పరిహారం చెల్లించే ఉద్దేశం ఉంది కాబట్టే గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారు.

ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పరిహారం ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఇలా అనేక ఆంక్షలు పెడుతున్నారు.. మన్ను తిని బతకాలని చెబుతోంది ఈ ప్రభుత్వం. జగనన్న సీఎం అయితే రైతు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుంది..’’ అని చెప్పారు. బడన్నపల్లి క్రాస్‌రోడ్డులో 11.15కు జిల్లాకు చెందిన పలువురు ముస్లిం సోదరులు షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు రాగా వారికి షర్మిల బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బడన్నపల్లి స్థానికులంతా తమకు గ్రామాల్లో నీళ్లు లేవని, కరెంటు ఉండడం లేదని వాపోయారు. అర్ధరాత్రి కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు పంట వద్దే పడుకోవాల్సి వస్తోందని, ప్రాణాలకు కూడా భద్రత లేదని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు ఉండేదని, వర్షాలు బాగా పడేవని గుర్తుచేసుకున్నారు. అందుకు ‘‘రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. రాజన్న ఉన్నప్పుడు మాట మీద నిలబడ్డాడు. అందుకే అప్పుడు సుభిక్షంగా ఉంది..’’ అని షర్మిల వారితో పేర్కొన్నారు. రైతుల అవసరాలు గుర్తించి ముందు చూపుతో రాజన్న కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేశారని, ఈ ప్రభుత్వానికి ముందు చూపులేదని విమర్శించారు.
స్థానికులు నీటి సమస్యను షర్మిలతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకురావడంతో ఆప్పుడు నీటి సమస్య లేదు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ నీళ్లు రాక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రభుత్వం నిద్రపోతోంది. ముఖ్యమంత్రికేం బాగానే ఉన్నారు. మూడు కిలోమీటర్లు పోయి ఆయన భార్య నీళ్లు మోసుకొస్తే ఆ బాధ అర్థమయ్యేది. ఈ పాపం ఈ సర్కారుదే..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.15కు గరుడాపల్లి సమీపంలో భోజన విరామానికి ఆగారు. జ్వరం కారణంగా విశ్రాంతి తీసుకుని తిరిగి సాయంత్రం 5 గంటలకు బయలుదేరారు. దారిలో వసంతపురం గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు చిగిచెర్లకు చేరుకోగా స్థానికులు షర్మిలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం తుంగభద్ర నీటిని తీసుకురావడంలో విఫలమవడం వల్లే ఇక్కడ నీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. అనంతరం రాత్రి 7.40కి చిగిచర్ల సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రిబస స్థలానికి చేరుకున్నారు

షర్మిలకు జ్వరం

షర్మిలకు శుక్రవారం రాత్రి నుంఛి  జ్వరం రావడంతో కొద్దిగా నీరసించారు. రాత్రి 101.8 డిగ్రీల జ్వరం ఉందని, రెండు రోజులుగా తీవ్ర జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారని షర్మిల చిన్నాన్న కుమారుడు,  వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రానికి జ్వరం కాస్త తగ్గిందన్నారు. ఉదయం అనంతపురం నుంచి రిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేశ్వరరావు షర్మిలకు వైద్య పరీక్షలు చేశారు. సాయంత్రం పులివెందుల నుంచి వైద్య నిపుణులు, వైఎస్ జగన్ మామ, అత్తగార్లు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణమ్మ వచ్చి షర్మిలను పరీక్షించారు. షెడ్యూలు ప్రకారం షర్మిల శనివారం 13.8 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా.. 8.5 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగారు. పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, మరో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఆయన సతీమణి మాధవి, వాసిరెడ్డి పద్మ తదితరులు నడిచారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాయంత్రం కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...