Friday 26 October 2012

షర్మిల వెంట వైఎస్ వీరాభిమానులు

గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన గజ్జల కృష్ణారెడ్డి చెప్పులు లేకుండానే షర్మిల వెంట నడుస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడుస్తానని ఆయన తెలిపారు. వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోట మండలం నుంచి 500 కిలోమీటర్లు నడిచినట్లు తెలిపారు. వైఎస్‌ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన పాదయాత్రలో పాల్గొన్నానని, ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం నడుస్తున్నానని చెప్పారు.
అభిమానమే నడిపిస్తోంది:     ప్రకాశం జిల్లా ఇరుసులగుండానికి చెందిన సుబ్బారెడ్డి వైఎస్ వీరాభిమాని. మహానేతఅధికారం చేపట్టిన మొదటి సంవత్సరమే పొగాకు పంటకు గిట్టుబాటు ధర రావడంతో లాభపడ్డారు. నాటినుంచి వైఎస్ ఏం చేసినా మద్దతిచ్చారు. అదే అభిమానంతో ఇప్పుడు షర్మిలతోపాటు ఇచ్ఛాపురం వరకు నడుస్తున్నారు.

Thursday 25 October 2012

షర్మిలను ఆదరిస్తున్నఅనంత ప్రజలు

జగన్ సోదరి షర్మిల  ఏడోరోజు పాదయాత్ర అనంతపురంజిల్లాలోని దాడితోటలో ప్రారంభమై శివంపల్లిలో ముగిసింది. ఏడోరోజున షర్మిల 15 కిమీ నడిచారు. మరో ప్రజాప్రస్థాన యాత్ర వంద కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. ఈ ఏడు రోజుల్లో మొత్తం 106 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల ప్రజల సమస్యలపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. త్వరలో రానున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పాలనలో ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు.
 షర్మిలను అనంత ప్రజలు ఆప్యాయంగా ఆదరిస్తున్నారు.  రాజకీయ కుటుంబ సభ్యురాలికి ఘనస్వాగతం పలుకుతున్నారు. మరో ప్రజాప్రస్థాన పాదయాత్రలో అడుగులో అడుగేస్తూ మద్దతుగా నడుస్తున్నారు. ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు ఓపిగ్గా తెలుసుకుంటూ వాటికి తనదైన రీతిలో స్పందిస్తూ షర్మిల ముందుకు కదులుతున్నారు.  చిల్ల కొండయ్యపల్లి గ్రామస్థులతో మాట్లాడిన షర్మిల హంద్రీనీవా పనుల ముగింపులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.. 
చిల్లకొండయ్యపల్లినుంచి బయలుదేరిన షర్మిల తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామంలో ఓ సామాన్యురాలి ఇంట్లో దసరా పండగ జరుపుకున్నారు. ఇక్కడి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుడి పక్కనే ఉన్న  పూజారి భార్య వరాలు ఇంటికి వెళ్లారు. వరాలు దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబానికి అండగా వున్నారు. అనుకోని అతిథిని చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వరాలు...షర్మిలను సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. తాను చేసుకున్న పిండివంటలు, తీపి పదార్థాలను తినిపించారు.
అనంతరం తాడిమర్రి చేరుకున్న షర్మిల ఇక్కడ ఏర్పాటైన బహిరంగసభలో మాట్లాడారు. సకాలంలో కరెంటు రాక, ఆరోగ్యశ్రీ అందక..ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ వస్తుందో రాదో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అటు కాంగ్రెస్ ఇటు టిడిపి చోద్యం చూస్తున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం  చేసారు. అక్కడనుంచి శివంపల్లికి చేరుకున్న షర్మిల ఈ గ్రామ ప్రజల సమస్యలన్నింటిని సావధానంగా విన్నారు. తాగునీటి సమస్యను తీర్చడానికి తమ పార్టీ నేత మర్రి చంద్రశేఖరరెడ్డి సాయం చేస్తారని హామీఇచ్చారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అందక చదువాపేసిన జగదీశ్వరరెడ్డి అనే వికలాంగుని దుస్థితి తెలుసుకొని అతని ఎంబిఏ కోర్సు పూర్తవ్వడానికి ఆర్థిక సహాయం అందిస్తానని షర్మిల భరోసా ఇచ్చారు.

Wednesday 24 October 2012

పాదయాత్ర లో ప్రజా ప్రతినిధులు

వైఎస్సార్ జిల్లాలో ఐదున్నర రోజులు 82.5 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వీలైనప్పుడల్లా ఐదు రోజుల పాటు పాదయాత్రలో పాల్గొనగా.. పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పూర్తిస్థాయిలో పాదయాత్రలో కొనసాగుతున్నారు. వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కె.శ్రీనివాసులు పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక పొరుగు జిల్లాల నుంచి పలువురు శాసనసభ్యులు యాత్రలో ఒకటి రెండు రోజులు నడిచారు. వీరిలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండు రోజులు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మొదటి నుంచీ నడుస్తున్నారు. ఎమ్మెల్సీలు శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి తదితరులు వైఎస్సార్ జిల్లాలో పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కొండాసురేఖ, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి తదితరులు తొలి మూడురోజులు యాత్రలో పాల్గొన్నారు.

అనంతకు చేరుకున్న మరో ప్రజాప్రస్థానానికి అపూర్వ స్వాగతం

 
వైఎస్సార్ తనయ, జగన్ సోదరి, వైఎస్సార్ జిల్లా ఆడపడుచు షర్మిలకు ఆ జిల్లా ప్రజలు సరిహద్దుల్లో ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. మంగళవారం పార్నపల్లిలో బహిరంగ సభతో జిల్లాలో యాత్ర పూర్తయింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడి వంతెన దాటే సమయంలో జిల్లా మహిళలు షర్మిలకు గాజులు, కుంకుమ, పూలతో సాంప్రదాయకంగా వీడ్కోలు పలికారు. జిల్లా ప్రజలు ఆదరించిన తీరుకు షర్మిల శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఐదున్నర రోజుల్లో 82.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లాకు చేరుకున్న మరో ప్రజాప్రస్థానానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికి షర్మిలను అక్కున చేర్చుకున్నారు. దాదాపు 10 వేల మంది ప్రజలు సరిహద్దులోకి వచ్చి స్వాగతం పలికారు. యాత్ర ప్రవేశించిన దాడితోట నుంచి షర్మిల బసచేసిన ప్రాంతం వరకు జనం బారులు తీరి ఆత్మీయంగా ఆదరించారు. జిల్లా ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.

వైఎస్ పధకాలకు కిరణ్ తూట్లు

 దొందూ దొందే అన్నట్టు చంద్రబాబు ప్రజలను గాలికి ఒదిలేయగా.. రాజశేఖరరెడ్డి తెచ్చిన పథకాలన్నింటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి తూట్లు పొడిచారు..’ అని షర్మిల విమర్శించారు. ఆరో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్ జిల్లా సరిహద్దులోని నేర్జాంపల్లి నుంచి ఆమె పాదయాత్ర కొనసాగించారు. నేర్జాంపల్లి దాటాక మార్గం మధ్యలో ఉన్న గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం వద్ద ఆగారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక నేత వైఎస్ అవినాష్‌రెడ్డి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు వివరాలు తెలిపారు. అనంతరం షర్మిల స్పందిస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రావతి రిజర్వాయర్‌కు తెచ్చేందుకు వైఎస్ తాను చనిపోయేనాటికి 90 శాతం పనులు పూర్తి చేస్తే.. ఆయన చనిపోయిన మూడేళ్లలో ఈ ప్రభుత్వం కనీసం రాయి కూడా కదపలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఈ పథకం పూర్తయితే చిత్తూరు జిల్లా నగరి వరకు నీళ్లొచ్చే అవకాశం ఉందట. కానీ ఆ చిత్తూరులో పుట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ పథకం పూర్తిచేయాలని ఎందుకు లేదు? అక్కడే పుట్టిన చంద్రబాబు ఈ పథకం ఎందుకు పూర్తిచేయలేదని ఎందుకు నిలదీయలేదు? రాజశేఖరరెడ్డి పుట్టిన జిల్లా అంటే అంత కక్షా? ఈ నిర్లక్ష్యం, ఈ రాక్షస పాలన కొనసాగడానికి ఇక వీల్లేదు. ఇంతమందికి అన్నంపెట్టే ఈ ప్రాజెక్టుకు అన్యాయం చేసే ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు. జగనన్న సీఎం అయిన ఒకటి, రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తారు..’ అని హామీ ఇచ్చి అక్కడి నుంచి కదిలారు.
 

నాడు వ్యవసాయం దండగ అనలేదా? బాబు గారూ

 
ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, పాదయాత్ర పేరుతో నాటకాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల విమర్శించారు. ‘ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలి. కానీ పెట్టరు. ప్రభుత్వం పడిపోతే జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయనకు భయం..’ అని దుయ్యబట్టారు. ఆరో రోజు మంగళవారం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె పలు చోట్ల ప్రసంగించారు. ‘రైతులు కష్టాల కడలిలో ఉంటే చంద్రబాబు పాలించిన 9 ఏళ్లలో సాగునీటికి కనీసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేయలేదు. అదే రైతు పక్షపాతి రాజన్న 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు మనసులోని మాటను ఆయనే పుస్తక రూపంలో బయటపెట్టుకున్నారు. వ్యవసాయం దండగ అని రాసుకున్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దని, ఇస్తే సోమరిపోతులు అవుతారని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమని రాసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో ఎల్లో డ్రామాలు ఆడుతూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. కరువు కోరల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలులో పెట్టింది మీరు కాదా చంద్రబాబూ? వారింట్లో సామాను లాగేసుకుంది మీరు కాదా? మీ హయాంలో 4 వేల రైతు ఆత్మహత్యలు నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది మీరు కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవడం నిజం కాదా? ఇంకా ఎందుకు నాటకాల పాదయాత్రలు?’ అని షర్మిల ధ్వజమెత్తారు.

Monday 22 October 2012

ఒంటికాలితో నడుస్తున్నా బాధ లేదు

షర్మిల పాదయాత్రలో రోజూ లక్షలాది మంది పాల్గొంటున్నారు. తనను కలిసే అందరితో ఆమె ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అయితే రోజూ ఉదయాన్నే ఒక వ్యక్తిని మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకుని పలుకరిస్తారామె! అతడి పేరు వెంకటయ్య. మహబూబ్‌నగర్ జిల్లా వాసి. వికలాంగుడు అయినప్పటికీ ఒక్క కాలితో నడుస్తూ రోజూ అతడు యాత్రలో పాల్గొంటున్నాడు. అది చూసి చలించిపోయిన షర్మిల రోజూ ‘గుడ్‌మార్నింగ్ వెంకటయ్యన్న’ అంటూ ఆప్యాయంగా అతడిని పలుకరిస్తున్నారు. ఈ ఆత్మీయ పిలుపుతో వెంకటయ్య మరింత ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటున్నారు. ‘‘షర్మిలమ్మే మా దేవత. ఆమెతోనే మా దసరా పండుగ. నేను ఒంటికాలితో నడుస్తున్నాబాధ  లేదు. మా జగనన్న చెల్లెలు ప్రజల కోసం నడుస్తూ, వారి కష్టాలను తెలుసుకుంటూ, వారిని ఓదారుస్తున్న తీరు చూసి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. నాకు శక్తి ఉన్నంత వరకూ యాత్రలో షర్మిలమ్మతో నడుస్తా!’’ అని చెబుతున్నాడు వెంకటయ్య. ఈయనలాగే షర్మిలతో పాటు ఇచ్ఛాపురం వరకూ చాలా మంది పాదయాత్ర చేస్తున్నారు.

జడివానలోనూ పాదయాత్ర..



ఆదివారం పులివెందుల నుంచి లోపట్నూతల వరకు 16.2 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో మహిళలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లి విజయమ్మ, వదిన వైఎస్ భారతిలతో కలసి షర్మిల చేసిన ఈ పాదయాత్రలో ఉదయం నుంచి భోజన విరామం వరకు దాదాపు 10 వేల మంది కదం తొక్కారు. వీరిలో దాదాపు ఏడెనిమిది వేల మంది మహిళలే!! భోజన విరామం కంటే ముందు చిన్నకుడాల క్రాస్‌రోడ్డు వద్దకు పొద్దుటూరు నుంచి దాదాపు 2,500 మంది మహిళలు తమ పిల్లలను వెంటేసుకుని వచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపారు. వీరిలో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ‘నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుకు ధైర్యం రాలేదు. నాన్న ముఖ్యమంత్రి అయ్యాక పరిహారం ఇచ్చారు. రూ. 200 కోట్ల రుణాలు మాఫీ చేశారు. మరో రూ. 312 కోట్ల రుణమాఫీకి జీవో కూడా జారీ చేసినా.. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దాన్ని అమలుచేయలేదు. ఇంతకుముందు ఎవరూ చేయలేని ఆలోచన నాన్న చేశారు. చేనేత కార్మికులు మగ్గాల మీద పనిచేస్తున్నప్పుడు కంటిచూపు దెబ్బతింటుందన్న ఆవేదనతో వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. జగనన్న సీఎం అయ్యాక ఆ పెన్షన్ రూ. 1,000కి పెరుగుతుంది..’ అని పేర్కొన్నారు. జడివానలోనూ ఆగని పాదయాత్ర..
సాయంత్రం లింగాలవైపు పాదయాత్ర సాగుతుండగా 6 గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది. లింగాల మూడు కిలోమీటర్లు ఉందనగా వర్షం జడివానగా మారింది. అదే వర్షంలో షర్మిల ముందుకు సాగారు. షర్మిలతోపాటే పాదయాత్రలో ఉన్న అభిమానులంతా ముందుకు సాగారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి తోటలు కొట్టేస్తున్న తరుణంలో ఇప్పుడు వర్షాలు రావడం స్థానికులకు ఆనందాన్ని కలిగించింది. ‘వర్షం వస్తే రాజన్న వచ్చినట్టే ఉంది..’ అని స్థానికులు అనడం వినిపించింది.

కక్ష కాక మరేంటి?’

‘ఒక రోజు వస్తుంది. ఎలాగైతే ఎగిసే కెరటాన్ని, ఉదయించే సూర్యుడిని ఆపలేరో.. అలాగే జగనన్ననూ ఆపలేరు. ఆరోజు ఆ దేవుడే జగనన్నను బయటకు తెస్తాడు. ఆ రోజు ఈ కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు. ఆ రోజు మన రాజన్న రాజ్యం దిశగా నడుస్తాం. రాజన్న ప్రతి ఆశయాన్ని జగనన్న నెరవేరుస్తాడు. అలాంటి రోజు కోసం ఎదురు చూద్దాం. ఆరోజున మీరంతా ఆ పార్టీలకు బుద్ధిచెప్పాలి..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకూ నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో మూడో రోజు శనివారం షర్మిల పులివెందుల బహిరంగ సభలో మాట్లాడారు.

‘మీ రాజన్న గురించి, మీ జగనన్న గురించి నేను మీకు చెప్పాల్సిన పనిలేదు. మంచి మనసు, మాట మీద నిలబడే నైజం వారిద్దరిది. జగనన్న నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. నేను రాజన్న పాదాన్ని. జగనన్న విడిచిన బాణాన్ని. కాంగ్రెస్, టీడీపీలు జగనన్నను మన మధ్యకు రానివ్వలేని పరిస్థితి సృష్టించడంతో మీకు ధైర్యం చెప్పమని అన్న నన్ను పంపించాడు. 30 ఏళ్లు కాంగ్రెస్‌కు విశ్వాసంతో సేవ చేస్తే, ప్రతి పథకానికి వాళ్ల పేర్లే పెడితే వారిచ్చిన బహుమతి ఎఫ్‌ఐఆర్‌లో నాన్న పేరు చేర్చడం. నాన్న చనిపోయినప్పుడు 600 మంది గుండె ఆగితే వారిని ఓదార్చాలన్న కనీస బాధ్యత ఆ పార్టీకి గుర్తుకు రాలేదు. ఓదారుస్తానని ఇచ్చిన మాట కోసం కట్టుబడిన జగనన్నను కక్ష గట్టి జైల్లో పెట్టారు. కాంగ్రెస్‌లోనే ఉంటే సీఎం కూడా అయ్యేవారని ఆజాద్ చెబుతున్నారు. అంటే ఇది కక్ష కాక మరేంటి?’ అని ప్రశ్నించారు.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...