Saturday 20 October 2012

రైతులపై కేసులు పెట్టిన ఘనత బాబుది..


" వేరుశనగ రైతుల కష్టాలపై ఆవేదన చెందానని,  ఈ ప్రభుత్వ మొండి వైఖరికి , జగనన్నపై కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి తనతోపాటు కదం తొక్కాల"ని షర్మిల  పిలుపునిచ్చారు. పాదయాత్ర రాత్రికి వేములకు చేరుకున్న సందర్భం గా  అక్కడ భారీ జన సమూహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.  ‘‘చంద్రబాబు సీఎం అయితే ఇక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భయపడుతున్నారు. కరెంటు చార్జీలు పెంచొద్దంటే రైతులను కాల్చిచంపిన ఘనత బాబుది. రైతు కుటుంబాలను పరామర్శించకుండా పోలీసులను పరామర్శించిన ఘనత ఆయనది. కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో కేసులు పెట్టి రైతులను జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపినట్టుగానే.. ఇప్పుడు కరెంటు కూడా ఇవ్వకుండా చార్జీలు భారీగా పెంచిన ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపాలి..’’ అని పిలుపునిచ్చారు. వేముల సమీపంలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7.50కి షర్మిల చేరుకున్నారు. రెండోరోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.
వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రెండోరోజు కూడా పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మధ్యాహ్న విరామ సమయానికి కొద్దిగా ముందు పాదయాత్ర నుంచి పక్కకు వచ్చిన విజయమ్మ.. తిరిగి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 వరకు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఆరోగ్యం దెబ్బతింటుందని, కారులో రావాలని సూచించగా వేముల వరకు కారులో వచ్చారు. వేముల బహిరంగ సభలో విజయమ్మ కూడా పాల్గొన్నారు.

ఇది ముందుచూపు లేని సర్కార్...షర్మిల


పేదల గోడు పట్టని ప్రభుత్వంపై, ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై  వైఎస్ తనయ షర్మిల నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే ముందుచూపు కూడా లేదని, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే మళ్లీ రాజన్న పాలన రావాలని, అది జగనన్నతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. రైతన్నలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు, మహిళలతో మమేకమవుతూ శుక్రవారం వైఎస్సార్ జిల్లాలో షర్మిల రెండోరోజు ‘మరో ప్రజాప్రస్థానం’ కొనసాగించారు. వెళ్లిన ప్రతిచోటా జనం షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరెంటు కష్టాలు.. పింఛను వెతలు.. ఫీజుల వేదన.. ఇలా అనేక సమస్యలను ఆమెతో పంచుకున్నారు. వైఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఉదయం 9.50కి వేంపల్లి సమీపంలోని రాజీవ్‌నగర్ వద్ద పాదయాత్ర ప్రారంభమైంది.
యాత్ర ముందుకు సాగుతుండగా.. సయ్యద్ బీబీ అనే మహిళ తన బాధలు వివరించింది. వైఎస్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నానని, ఇప్పుడు నిలువ నీడైతే ఉంది గానీ కరెంటు బిల్లులతో, కరెంటు కోతలతో నిద్రే కరువైందని విలపించింది. ఇందుకు జగనన్న తొందర్లోనే మీ ముందుకు వస్తాడని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని చెబుతూ షర్మిల ఆమెను ఊరడించారు. అక్కడి నుంచి ముందుకు సాగుతుండగా వృద్ధ మహిళలు చాలామంది ఎదురొచ్చారు. రాజశేఖరరెడ్డి వల్లే తనకు పెన్షన్ వచ్చిందని ఒకరు.. మూడేళ్లుగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటూనే ఉన్నా ఇవ్వడం లేదని మరొకరు చెప్పారు. ‘‘చంద్రబాబు ఉన్నప్పుడు బియ్యం కార్డు ఉంటేనే సంఘంలో చేరనిచ్చేవారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాక అందరం చేరాం. పావలా వడ్డీ పథకం అందింది. కానీ ఇప్పుడు మాతో బలవంతంగా వడ్డీ కట్టించుకుంటున్నారు..’’ అని మరికొందరు మహిళలు షర్మిల ముందు ఆవేదన వ్యక్తంచేశారు.
మార్గమధ్యంలో కత్తులూరు పంచాయతీ మహిళలు షర్మిలకు ఎదురేగి స్వాగతం పలికారు. ‘‘మాకు సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయి. కనీసం తాగునీరు కూడా లేదు. కరెంటైతే అసలే ఉండడం లేదు..’’ అని వాపోయారు. ఈ సందర్భగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కరెంటు ఎందుకు ఉండడం లేదో మీకు తెలుసా? ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని తెలుసు. కరెంటు సమస్య ఉందనీ తెలుసు. మరి కరెంటు ఎందుకు కొనుగోలు చేయలేదు. పొరుగు రాష్ట్రాలు ముందే కొనుక్కుని అక్కడ పరిశ్రమల పరంగా ఎలాంటి నష్టం లేకుండా ముందుకు వెళుతుంటే.. పారిశ్రామికంగా దూసుకుపోతుంటే.. ఇక్కడ మన ముఖ్యమంత్రి పరిశ్రమలను నెలలో సగం రోజులు మూసేసుకోమంటున్నారు. అలా అయితే వాటిలో పనిచేసే కార్మికులు ఏం కావాలి? వారి కుటుంబాలు ఏం కావాలి? మీరే చెప్పండి.. ఏం చేద్దాం? వైఎస్ ఉన్నప్పుడు ముందుచూపుతో విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించాలని తలపెడితే.. ఇప్పుడేమో ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ కూడా తేలేని పరిస్థితిని తెచ్చింది ఈ ప్రభుత్వం.. ఈ పాలకులకు రైతులంటే ఎంత నిర్లక్ష్యమో తెలుస్తోంది.. వాళ్లకు కావాల్సింది సీఎం కుర్చీ. ఢిల్లీకి వెళ్లి రావడం. టీడీపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దు..’’ అని మండిపడ్డారు. వికలాంగుడైన తన మనవడికి పెన్షన్ ఇవ్వడం లేదని ఓ వృద్ధురాలు విలపించగా.. ‘‘జగనన్న సీఎం అయితే కనీసం రూ.600లకు తగ్గకుండా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నాడు.. అధైర్యపడకమ్మా.. మీకు ధైర్యం చెప్పేందుకే జగనన్న నన్ను పంపాడు..’ అని భరోసా ఇస్తూ షర్మిల ముందుకు కదిలారు.


 

కన్నీళ్లు అబద్ధం చెబుతాయా?



కత్తులూరు పంచాయతీకి చెందిన మల్లకాని సిద్దయ్య కొడుకు శివ పాములూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాదయాత్ర సాగుతుండగా గొర్రెలు కాస్తూ కనిపించాడు. ఆ పిల్లాడితో షర్మిల సంభాషణ ఇదీ..

షర్మిల: ఏం చిన్నా.. గొర్రెలు కాస్తున్నావ్?  
శివ (కన్నీళ్లతో): మా నాన్నకు బాగోలేకుంటే నేను కాపలాకు వచ్చా. స్కూలుకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి. ఇక్కడ తిండి లేదు. పశువులకు మేత కూడా లేదు. అమ్మకు చెవుడు. పెన్షన్ కూడా రాదు. నాన్నకు బీపీ, షుగర్. పనికి వెళ్లలేడు. అన్న జేసీబీ మీద పనిచేస్తాడు. నాన్న బ్యాంకుకు వెళితే కనీసం లోను కూడా ఇవ్వలేదు.  
షర్మిల: చూశారుగా.. ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా? చిన్న పిల్లాడు. చదువుకోవాల్సిన వయసు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. జగనన్న ఇలాంటి పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం తెస్తానని చెప్పాడు. పిల్లలను బడికి పంపితే తల్లులకు నెలకు రూ.500 చొప్పున సాయం చేసే పథకం అది. ఏ సాయం చేయని ఈ ప్రభుత్వం మనకు అవసరమా?


నందిపల్లి సమీపంలో భారీ సంఖ్యలో మహిళలు ఎదురేగి రోడ్డుపై కూర్చోవడంతో షర్మిల అక్కడే కూర్చుని వారితో ముచ్చటించారు. వృద్దురాలు లేచి ‘‘నాకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆరోగ్యశ్రీ కిందికి రాదట’’ అని చెప్పింది. ‘ఈ ప్రభుత్వానికి ప్రాణాలంటేనే లెక్కలేదు. 108నే ఆపేశారు. జగనన్న రాగానే ప్రతి పేదవాడి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు’’ అంటూ షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. 

నందిపల్లి సమీపంలో పులివెందుల జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘ఒక్క ప్లేస్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఈ కళాశాల వైఎస్ మానస పుత్రికగా పేరుగాంచింది. అలాంటిది అభివృద్ధికి నోచుకోకుండా పోయింది..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీ తరపున పోరాడుతాం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతాం’’ అని షర్మిల వారికి హామీనిచ్చారు. తాళ్లపల్లి సమీపంలోని వేరుశనగ రైతుల వద్దకు వెళ్లిన షర్మిల వారి గోడు విని చలించిపోయారు. ‘‘కౌలు రైతులకు రుణాలు రావు. పంట నష్టపోతే పరిహారం అందదు. కనీసం ఎంత నష్టం వచ్చిందో కనుక్కునేందుకు అధికారులు రారు.. ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దు. వైఎస్ ఉంటే ఈ నష్టాన్ని భర్తీ చేసేవారు’’ అని అన్నారు. రెండో రోజు పాదయాత్రకు అడుగడుగునా  ప్రజలు బ్రహ్మరథం పట్టారు
జనంతో మమేకమవుతూ  వైఎస్ తనయ  ముందుకు సాగింది. 

Thursday 18 October 2012

జగనన్న వదిలిన బాణాన్ని..... షర్మిల

రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికురాలిగా మీ ముందుకొస్తున్నా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నానని షర్మిల తెలిపారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని...ప్రజా సమస్యల పరిష్కారానికి   అందరూ ముందుకు  రావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ మరో ప్రజా ప్రస్థానానికి రెండే ప్రధాన అంశాలని ....ఒకటి అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, రెండోది అసమర్థ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీయటమే లక్ష్యమన్నారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తాను నల్లబ్యాడ్జి పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆమె కోరారు. ప్రతి అడుగులో నాన్నను ,అన్నను తలచుకుంటూ  ప్రజల కష్టాలను తెలుసుకుంటానని చెప్పారు.వైయస్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా క్షోభ పెడుతోందని ఆమె విమర్శించారు. రైతులను నిర్లక్ష్యం చేసిందని, విద్యార్థులను దెబ్బ తీసిందని, విద్యుత్ సంక్షోభం ఘోరంగా ఉందని ఆమె అన్నారు. ఈ రోజు రైతుల కోసం చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబుకి గానీ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయి జగనన్నపై కేసులు పెట్టించారని, జగనన్నను జైల్లో పెట్టించారని ఆమె ఆరోపించారు. చీకట్లో చంద్రబాబు చిదంబరాన్ని కలిసి తనపై కేసులు లేకుండా చంద్రబాబు మేనేజ్ చేసుకున్నారని ఆమె అన్నారు.బాబు పై షర్మిల తీవ్ర స్తాయిలో విమర్శలు చేసారు .సభ ముగిసిన తర్వాత షర్మిల పాదయాత్ర మొదలైంది.

Wednesday 17 October 2012

ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పాద యాత్ర

ప్రజలకు మాట ఇవ్వడానికి  నాడు  వైయస్‌ పాదయాత్ర చేశారు.
అదొక ప్రజాప్రస్థానం.
ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి వైయస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర చేశారు.అది ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రస్థానం. ప్రజల బాగోగులను గాలికొదిలేసిన సర్కారును నిలదీసేందుకు
గురువారం నుంచి వైయస్‌ కుమార్తె షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇది మరో ప్రజా ప్రస్థానం. సందర్భాలు మారినా.. వ్యక్తులు మారినా ఆ కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఒక్కటే. ప్రజలపట్ల ఆ కుటుంబానికి ఉన్న బాధ్యత ఒక్కటే. ప్రజల్లో వారికున్న విశ్వసనీయత ఒక్కటే.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పడకేసింది..పేద విద్యార్థులకు పెద్దచదువులు దూరమయ్యాయి..విద్యుత్‌ కరువయ్యింది. రైతుల పంటలు ఎండుతున్నాయి. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది. 108, 104 వాహనాలు మూలనపడ్డాయి. పేదల బతుకుల్లో వెలుగులు మాయమయ్యాయి. వైఎస్‌ ఉన్నప్పుడు ఎంతో భరోసా...ఇపుడు బతుకే భారం..మనసుంటే మార్గం ఉంటుంది..కానీ.. బడుగు జీవులను ఆదుకోవాలన్న ఆ మనసే లేకపోతే...ఇప్పుడు కాంగ్రెస్‌లో అదే లోపిస్తోంది...ప్రజాసమస్యల్ని సర్కారు గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టీడీపీ తనకేమీ పట్టనట్టుంది. అందుకే ప్రజాసమస్యలపై మహానేత కూతురు షర్మిల  పోరాటం చేపట్టారు. మరోప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
తన పాదయాత్రలో ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ... సర్కారు తీరును ఎండగడుతూ ముందుకు సాగనున్నారు...
ప్రజాసమస్యలపై నిరంతర పోరాటాల్లో భాగంగా పాదయాత్ర చేయాలని జగన్ ఇదివరకే నిర్ణయించుకున్నారని ఆ బాధ్యతను షర్మిల చేపడుతున్నారన్నారు  వైఎస్‌ విజయమ్మ.
చిన్నప్పట్నుంచి తన తండ్రి రాజకీయాలను దగ్గరుండి చూసిన షర్మిలకు ప్రజల్లోకి వెళ్లడం, మాట్లాడటం కొత్తకాదు, ఇంటా బయటా నిరంతరం తన తండ్రి చుట్టూ వుండే ప్రజలను దగ్గరగా గమనించిన ఆమె కడప ఉపఎన్నికల సమయంలోనే గడపగడపకు ప్రచారం నిర్వహించి ప్రజల మనసు గెలుచుకున్నారు. మొన్నటికి మొన్న జరిగిన ఉపఎన్నికల్లోనూ ప్రభంజనాన్నే సృష్టించారు షర్మిల . తండ్రిపోలికలే కాదు, ఆయన ఆలోచల్ని వారసత్వంగా పొందిన షర్మిల మరో ప్రజాప్రస్థాన పాదయాత్రతో అధికార కాంగ్రెస్‌ అసమర్ధత పాలనపై, ఆపాలనకు మద్దతుగా నిలిచిన ప్రధాన ప్రతి పక్ష అవకాశవాద రాజకీయాలపైనా ధ్వజమెత్తనున్నారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ పాదయాత్రలో జనంతో మమైకం కానున్నారు షర్మిల . ప్రజా సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసన తెలుపుతూ నల్లబ్యాడ్జిలు, నల్లరిబ్బన్లు చేతికి కట్టుకుని ముందుకు సాగనుంది షర్మిల . ఈ పాదయాత్ర ఆద్యంతం ప్రజాసమస్యల సాధనే లక్ష్యంగా సాగనుంది.
తెలంగాణ జిల్లాల్లో కూడా కొనసాగే ఈ మరో ప్రజాప్రస్ధానంతో పాటు ఓదార్పు కూడా ఆపబోమని విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్‌ కుమార్తెగా, జగన్‌ చెల్లెలుగా షర్మిల చేసే పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు. తమలో మహనేత రక్తమే ప్రవహిస్తుందని... వైఎస్‌ను నమ్మిన ప్రతిఒక్కరూ షర్మిలను కూడా నమ్మి ఆశీర్వదిస్తారని విజయమ్మ చెప్పారు.
పేదవాళ్ల కష్టాల్ని కళ్లతో కాదు.. మనసుతో చూశారు  వైఎస్.తన  పాదయాత్ర సందర్భంగా ప్రతిఒక్కరి సమస్యల్ని అధ్యయనం చేశారు. వైఎస్   చూపిన మార్గంలోనే ఆయన  కూతురు ప్రజల్లోకి రానున్నారు. ప్రజలకు మద్దతుగా నేనున్నానంటూ నిలవనున్నారు.

Tuesday 16 October 2012

షర్మిల కు కీలక పదవి

కడప ఎంపీ,వై సి పీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల కు పార్టీ లో కీలక పదవి ఇచ్చే సూచనలు  కన్పిస్తున్నాయి.షర్మిల ఏ హోదాలో పాదయాత్ర చేపడుతున్నారని విమర్శలు వస్తోన్న నేపధ్యం లో షర్మిల కు పార్టీ కార్యవర్గంలో ఒక పదవి ఇస్తే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం.ఇప్పటికే  పార్టీ కి జగన్ అధ్యక్షుడు కాగా విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు.ఒకే కుటుంబం నుంచి మరొక వ్యక్తీ కి పదవి ఇస్తే కుటుంబ పార్టీ అనే విమర్శలు కూడా రావచ్చు అని కొందరు నేతలు విజయమ్మకి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే  పార్టీ కోసం పెద్ద సాహసం చేస్తోన్న షర్మిల కు పదవి ఇవ్వడమే  సమంజసం అని మెజార్టీ నేతలు  సూచించినట్టు తెలుస్తోంది.ఈ విషయం జగన్ దృష్టికి తీసుకెళ్ళి అయన అనుమతి తో 18 న  ఇడుపుల పాయ లో జరిగే బహిరంగ సభ లో పార్టీ లో షర్మిల హోదా ఏమిటో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదిలా వుంటే   ఈ నెల 18 నుంచి ఇడుపుల పాయలో ప్రారంభంకానున్న షర్మిల పాదయాత్ర మరికొన్ని జిల్లాలలో జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలుత 14 జిల్లాలలో పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేసినా... నేతలు , కార్యకర్తల ఒత్తిడితో 16 జిల్లాల్లో సాగేలా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.18 న ఇడుపుల పాయలో ఉదయం పదకొండున్నర గంటలకు యాత్ర ప్రారంభం కాబోతుంది. అక్కడ నిర్వహించే బహిరంగ సభ తర్వాత వేంపల్లి , వేముల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. తొలి రోజు పాదయాత్రలో 14.5 కిలో మీటర్లు కొనసాగనుంది.  యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు జిల్లా స్థాయిలలో సమన్వయకమిటీలను , కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.యాత్రను విజయవంతం చేసే అంశంపైనా ..యాత్ర స్వరూపం,  పాదయాత్రకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు , వసతి సౌకర్యాలు , సభలు నిర్వహించాల్సిన ప్రాంతాలపైనా ప్రధానంగా  పార్టీ నేతలు దృష్టి సారించారు. నేతలు , కార్యకర్తలు ఎటువంటి ఆర్బాటాలకు పోకుండా యాత్రలో పాల్గొనాలని ...16 జిల్లాలోలో ఆరు నెలలపాటు షర్మిల ప్రజా ప్రస్థానం కొనసాగుతుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మొత్తం మీద షర్మిల పాదయాత్ర ప్రకటన పార్టీ కేడర్లో నవ్యోత్సాహాన్ని నింపిందని నేతలు భావిస్తున్నారు

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...