Tuesday 6 November 2012

కాంగ్రెస్ టీ డీ పీ లకు అధికారమే లక్ష్యం

  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యలు పరిష్కరిస్తాడన్న నమ్మకం ప్రజలకు ఏ కోశానా లేదని  జగన్‌ సోదరి  షర్మిల అన్నారు. అందుకే తమ సమస్యలు పరిష్కరించాలని  ప్రజలు  తమకు వినతిపత్రాలు ఇస్తున్నారని చెప్పారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 19వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్‌లో ఆమె ప్రసంగించారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానికి వంతపాడుతున్న ప్రతిపక్ష టీడీపీ వైఖరికి నిరసనగా చేపట్టిన పాదయాత్రలో అడుగడుగునా తమకు ప్రజలు వినతిపత్రాలు ఇవ్వడంపై మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి  అంటారట. మేం ఎందుకు పాదయాత్ర చేస్తున్నామని.. మాకు ప్రజలు అర్జీలు ఇచ్చుకుంటే, వినతిపత్రాలు ఇచ్చుకుంటే ఏం లాభమని ఆయన అన్నారట. మీకు విశ్వసనీయత లేదు గనుక మీకు అర్జీలు ఇచ్చుకున్నా ఈ జన్మలో నెరవేరుతాయన్న నమ్మకం ప్రజలకు లేదు. అందుకే మేం వెళ్లినప్పుడు మాకు అర్జీలు ఇస్తే.. కనీసం మేం అధికారంలోకి వచ్చినప్పుడైనా నెరవేరుస్తామన్న నమ్మకం వారికి ఉంది. అందుకే వారు మాకు వినతిపత్రాలు ఇస్తున్నారు. కేవలం అధికారం ఉంటే సరిపోదు ముఖ్యమంత్రి గారూ.. చిత్తశుద్ధి ఉండాలి. విశ్వసనీయత ఉండాలి..’’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. ‘‘నేనీరోజు చెబుతున్నా ముఖ్యమంత్రి గారికి.. మరణించిన రాజశేఖరరెడ్డి గారు సమాధానం చెప్పుకోలేరని తెలిసి.. కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, మానవత్వం కూడా లేకుండా  కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా చేర్చింది. కానీ మూడేళ్లు గడిచిపోయినా.. వైఎస్సార్‌ను ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అదీ ఆయనకున్న విశ్వసనీయత. జగనన్నను అన్యాయంగా జైలు పాలు చేశారు. దోషి అని రుజువు చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జగనన్న జైల్లో ఉన్నప్పటికీ  ప్రజలు కిరణ్‌కుమార్‌రెడ్డి మాకు వద్దు.. చంద్రబాబు మాకు వద్దు.. మాకు రాజన్న కొడుకే కావాలి.. మాకు జగనన్న ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారంటే.. అదీ జగనన్నకు ఉన్న విశ్వసనీయత’’ అని షర్మిల అన్నారు. ‘‘చంద్రబాబుకు తన పరిపాలనను మళ్లీ తెస్తానని చెప్పుకొనే ధైర్యం లేదు. వైఎస్ ఐదేళ్లలో ఏం చేశారో అవే చేస్తానని ఇప్పుడు చంద్రబాబు చెప్పుకొంటున్నారు. రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేసినట్టే తానూ చేస్తానని చెప్పుకొంటున్నారు. ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టే తానూ ఇస్తానని చెబుతున్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చినట్టే తానూ ఇస్తానంటున్నారు. పదవి ఉన్నప్పుడు ఏమీ చేయకుండా రాజశేఖరరెడ్డిని తిట్టుకుంటూ.. ఇప్పుడు మాత్రం రాజశేఖరరెడ్డి పాలనను అందిస్తానని చెప్పకనే చెబుతున్నారు. అసలు మీకు పాదయాత్ర చేసే అవసరమే లేదు. మీకు, మీ పార్టీకి, మీ పాదయాత్రకు చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలను ఇంత కష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకు దించేయడం లేదు? ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు? ’’ అని షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌కైనా, టీడీపీకైనా కావాల్సింది అధికారమని, అందుకోసం వారు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ఇప్పుడు కొత్తగా పాదయాత్ర అంటూ డ్రామా ఆడుతున్నారు. తన పాలనలో శ్మశానాలుగా మార్చిన ఆ గ్రామాల నుంచే పాదయాత్ర చేస్తున్నారు’’ అని విమర్శించారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...