"అమ్మా, వదిన ఢిల్లీ వెళితే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్టా?" అని జగన్ సోదరి షర్మిల ప్రశ్నించారు . ‘మాట ఇవ్వడమంటే,
దానిపై నిలబడడమంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదు. ప్రజాస్వామ్యాన్ని
పరిహాసం చే సి ప్రభుత్వంతో కుమ్మక్కయి అబద్ధపు కేసులు, వెన్నుపోటు
రాజకీయాలు చేస్తున్నారు. పైగా వాళ్లంటారు జగనన్న కాంగ్రెస్‌తో
కుమ్మక్కయ్యారట. అందుకే అమ్మ, వదిన ఢిల్లీ వెళ్లారట. అసలు మీరు మనుషులా? మా
లాయర్లు ఢిల్లీలో ఉంటే వారిని కలవడానికి వెళితే కూడా కుమ్మక్కయినట్టా? అలా
కుమ్మక్కయి ఉంటే జగనన్న ఎప్పుడో కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారు.
కుమ్మక్కయ్యింది మీరు.. అందుకే మీపై కేసులు ఉండవు. విచారణ ఉండదు. అందుకు
ప్రతిఫలంగా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతారు.’’ అని
బాబుపై షర్మిల నిప్పులు చెరిగారు.
‘‘దారిలో ఓ టమాటా రైతును కలిశాను.. తాను పండించిన టమాటాలను కింద
పారబోశాడు. కారణం.. దానికి ధర రాదట. కిలో ఒక్క రూపాయి వస్తుందట. ఈమాత్రం
దానికి ఇంత తీసుకెళ్లి అమ్మడం ఎందుకని పారబోశామని చెప్పాడు. మనసుకు చాలా
బాధేసింది. చాలా కష్టమనిపించింది. రాజన్న రైతుకు సకాలంలో ఎరువులు,
విత్తనాలు ఇచ్చి, కరెంటు ఇచ్చి, గిట్టుబాటు ధర ఇచ్చి, దురదృష్టవశాత్తూ పంట
నష్టపోతే పరిహారం ఇచ్చి రైతన్నకు అండగా నిలబడ్డాడు. కానీ వైఎస్ రెక్కల
కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతన్నను గాలికి వదిలేసింది. కడుపు మీద
కొట్టి వేడుక చూస్తోంది’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.సాయంత్రం 4.40కి మద్దికెర సమీపంలో కర్నూలు జిల్లాలోకి
ప్రవేశించిన షర్మిలకు వేలాదిగా ఆ జిల్లా ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.షర్మిలను చూడాలని, పాదయాత్రలో కదం తొక్కాలని యువతీయువకులు, మహిళలు, రైతులు
భారీ సంఖ్యలో తరలివచ్చారు. షర్మిల జిల్లాలోకి అడుగు పెట్టిన ప్రాంతం నుంచి
సభ ప్రాంతానికి వెళ్లడానికి మధ్య దూరం 3 కిలోమీటర్లు. అడుగు తీసి అడుగు
వేయడానికి వీల్లేనంతలా జనం పోటెత్తడంతో ఆమె సభ ప్రాంతానికి చేరుకోవడానికి
రెండుగంటలు పట్టడం గమనార్హం.
స్వాగతం పలికేందుకు తరలివచ్చిన నేతల్లో
వైఎస్‌ఆర్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యే
బాలనాగిరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు
వెంకటరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి,
మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, సాయి ప్రసాద్
రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు
బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, ఎర్రబోతుల
వెంకటరెడ్డి, జి.జయరామ్, పార్టీ నేతలు బుడ్డా శేషురెడ్డి, కర్రా
హర్షవర్ధన్‌రెడ్డి, ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, సురేందర్
రెడ్డి, జయంతి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
అక్టోబర్ 18న ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి సమాధి చెంతన ప్రారంభమైన ‘మరో
ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం నాటికీ ఐదున్నర రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో,
16 రోజుల పాటు అనంతపురం జిల్లాలో సాగింది. వైఎస్సార్ జిల్లాలో 82.5
కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 194.5 కిలోమీటర్ల మేర షర్మిల నడిచారు.
గురువారం 22వ రోజు అనంతపురం జిల్లాలో 8.2 కి.మీ. నడిచిన షర్మిల సాయంత్రం
నుంచి కర్నూలు జిల్లాలో 4.3 కి.మీ. పాదయాత్ర చేశారు. 22వ రోజు మొత్తం 12.5
కి.మీ. సాగింది. మొత్తంగా ఇప్పటివరకు 281.30 కిలోమీటర్ల మేర పాదయాత్ర
సాగింది.
అనంత
జిల్లాలో 16 రోజుల పాటు సాగిన షర్మిల పాదయాత్రలో జిల్లా ప్రజలు కదం
తొక్కుతూ అనంతమైన అభిమానం కురిపించారు. అక్టోబర్ 23న దాడితోట వద్ద భారీ
సంఖ్యలో జిల్లా ప్రజలు తరలివచ్చి స్వాగతం పలికి.. జిల్లా సరిహద్దు దాటేవరకు
వెన్నంటే ఉన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు కాపు రాంచంద్రారెడ్డి,
గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ డి.నారాయణ రెడ్డి, పార్టీ కేంద్ర పాలకమండలి
సభ్యులు తోపుదుర్తి కవిత, గిరిరాజు నగేష్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు
వై.విశ్వేశ్వర్‌రెడ్డి, పైలా నర్సింహయ్య, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, మాజీ
ఎమ్మెల్యే జొన్న రామయ్య, నేతలు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి
ప్రకాష్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, కడపల
మోహన్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి,
వై.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాదయాత్రలో షర్మిల వెంట నడిచారు. గురువారం
యాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యేలు సుచరిత, అమర్‌నాథ్‌రెడ్డి
తదితరులున్నారు.
సొంత బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు..అధికారంలోకి
రావడం కోసం అడ్డమైన దారులు తొక్కేందుకు కూడా ఆ పెద్దమనిషి వెను కాడడు..
నీచ రాజకీయాలు చేయడంలో బాబూకి సాటెవ్వరూ లేరని వైఎస్ తనయ షర్మిల చంద్రబాబు పై విమర్శనాస్త్రాలను సంధించారు. మరో ప్రజా
ప్రస్థానం పాదయాత్ర 21వ రోజు అనంతపురం జిల్లా గుంతకల్లులో కొనసాగింది.
పొట్టిశ్రీరాములు సర్కిల్‌లోఅశేష జనవాహిని మధ్య జరిగిన బహిరంగ సభలో
షర్మిల మాట్లాడారు. మొన్న వెలుగు చూసిన 2జీ స్పెక్ట్రం స్కామ్ కంటే
చంద్ర బాబు-రిలయన్సు కలిసి చేసిన కృష్ణాగోదావరి గ్యాస్ బేసిన్ స్కామ్
అతి పెద్దదని ఆమె ఆరోపించారు. ఆనాడు బాబు అధికారంలో ఉన్నప్పుడు
రియలన్స్‌కి కేజి బేసిన్‌ను కట్టబెట్టి, మనగ్యాస్‌ను మనకు దక్కకుండా
చేశాడని ఆమె విమర్శించారు.
ఈ ఉదంతాలన్నీ ఆనాడు వెలుగుచూడకుండా
ఉండేందుకు ఈనాడు సంస్థలో షేర్లు కొని రిలయన్సు వేలాది కోట్లు పెట్టుబడి
పెట్టిందని షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్ర భవి ష్యత్తును,ప్రజల అవసరాలను
దృష్టిలో పెట్టుకోకుండా రిలయన్స్‌కి మేళ్లు చేకూర్చిన చంద్రబాబుకి చట్టాలు
వర్తించవా అని ఆమె ప్రశ్నిం చారు. గత నెల 5వ తేదీ జగన్‌కి
బెయిల్ వచ్చేదని, అంతలోపే చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా
చీకట్లో కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి జగన్‌కి బెయిల్ రాకుండా
కుట్రపన్నారని ఆమె ఆరోపించారు.అన్ని వర్గాల వారిని పూర్తిగా విస్మరించిన
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లాయని షర్మిల చెప్పారు. వై సీపీ అధికారంలోకి రాగానే ఆనాడు వైఎస్ కన్న కలలను సాకారం చేస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్
ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరిస్తామన్నారు. అన్నదాతల
సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తో పాటు వారికి 3 వేల కోట్ల రూపాయలతో
ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అన్నివర్గాలు
ప్రజలు సుఖసంతోషా లతో ఉండాలన్నా, విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నా,
ముస్లీం మైనార్టీలు అన్ని రంగాల్లో అభి వృద్ది సాధించాలన్న రాజన్న రాజ్యం
తిరిగి రావాలన్నారు.
20వ రోజు పాదయాత్రలో భాగంగా గూళ్యపాలెంలో జగన్ సోదరి షర్మిల స్థానికులతో మాట్లాడారు. ఈ
సందర్భంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించారు. ఈ ప్రభుత్వ
వైఖరితో విసిగిపోయామన్నారు. ఆల్లె బాషా అనే వికలాంగుడికి 2011 జులై వరకు
పెన్షన్ వచ్చిందని, కానీ 15 నెలలుగా పెన్షన్ రాలేదని ఆయన భార్య
మొరపెట్టుకున్నారు. పెన్షన్‌కు సంబంధించిన ఖాతా పుస్తకం చూపించి.. తమకు
పెన్షనే ఎంతో కొంత ఆధారమని, వచ్చేలా చూడాలని వేడుకున్నారు. ఓ విద్యార్థి
మాట్లాడుతూ ‘గ్యాస్ ధర పెరిగిందని హాస్టల్లో మెనూ తగ్గించారు. జైల్లో
ఖైదీకి రూ. 40 వెచ్చిస్తే.. మాకు రోజుకు రూ. 17 మెస్ చార్జీగా ఇస్తున్నారు.
రాజన్న రాజ్యం రావాలి. మళ్లీ మాకు జగనన్న సీఎం కావాలి..’ అని అన్నారు.
స్థానికులంతా తమకు నీళ్లు రావడం లేదని, కరెంటు ఉండడం లేదని, పావలా వడ్డీ
కింద రుణాలు రావడం లేదని ఫిర్యాదు చేశారు.
ఇందిరమ్మ ఇల్లు మధ్యలో
ఆగిపోయి బిల్లులు రాలేదని వాపోయారు. ఓ రైతు మాట్లాడుతూ ‘అదనులో విత్తనాలు
సరఫరా చేయకుండా ఈప్రభుత్వం రైతులను దెబ్బతీస్తోంది. సబ్సిడీ విత్తనాలను
దళారులు చేజిక్కించుకుని అమ్ముకుంటున్నారు. వైఎస్ ఉన్నప్పుడు గ్రామం
యూనిట్‌గా ఇన్సూరెన్స్ ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది..’ అని
పేర్కొన్నారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ ‘మాకు ఉచిత బస్ పాస్ ఇవ్వడం లేదు..’
అని ఫిర్యాదు చేశారు. మరో విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతి
పరీక్షకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా.. షర్మిల స్పందిస్తూ
‘ఇది రాబందుల రాజ్యం అనడానికి చక్కటి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా
ఫీజులు వసూలు చేస్తారు. కరెంటు ఇవ్వరు. గ్యాస్ ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. ఉన్న
పెన్షన్లు తీసేస్తారు. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి
చెప్పండి. జగనన్న వచ్చాక రాజన్న కన్న ప్రతి కలనూ నెరవేరుస్తాడు. మీ
కష్టాలన్నీ తీరుస్తాడు’ అని భరోసా ఇచ్చారు.
గుంతకల్లు
నియోజకవర్గంలోకి..: 20వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు
వజ్రకరూర్‌లో ప్రారంభమై కమలపాడు, గూళ్యపాలెం, కొనకొండ్ల మీదుగా గుంతకల్లు
నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొనకొండ్ల వద్ద కర్నూలు జిల్లా మంత్రాలయం
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(టీడీపీ), గుంతకల్లు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ
ఇన్‌చార్జి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి షర్మిలకు
ఘనస్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడాక.. గుంతకల్లు
సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు షర్మిల 7.40కి చేరుకున్నారు. 20వ రోజు
పాదయాత్రలో 12 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 258.80 కిలోమీటర్ల
పాదయాత్ర పూర్తయింది. యాత్రలో ఎమ్మెల్యేలు కాపు రాంచంద్రారెడ్డి,
గురునాథరెడ్డి, ఎన్.ప్రసన్నకుమార్‌రెడ్డి, నేతలు తోపుదుర్తి కవిత, పార్టీ
జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి
వై.విశ్వేశ్వర్‌రెడ్డి, కిసాన్‌సెల్ కోఆర్డినేటర్ వై.మధుసూదన్‌రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
పందొమ్మిదో రోజు సోమవారం ఉదయం 10.15కు రాగులపాడులో పాదయాత్రకు బయలుదేరిన
షర్మిలకు పందికుంట క్రాస్ సమీపంలో వెంకటాంపల్లి, వీపీపీ తండా, వీపీసీ తండా,
జెరుట్ల రాంపురం వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు
విన్నవించుకున్నారు. ‘రాజశేఖరరెడ్డి మాకు భూములకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు
మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేరు. పావలా వడ్డీ రుణాలు రావడం లేదు.
తాగేందుకు నీళ్లు లేవు. కరెంటు లేదు. ఉన్న పెన్షన్లను తీసేస్తున్నారు..’
అని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ జగనన్న సీఎం కాగానే అర్హులందరికీ
పెన్షన్లు, రుణాలు ఇస్తారని, అమ్మ ఒడి పథకం అమలు చేస్తారని భరోసా ఇచ్చారు.
అనంతరం తండాల వాసులు షర్మిలకు కొప్పెర(అద్దాల పైట) కప్పి.. కత్తి, డాలు
ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు.
షర్మిల 12 గంటలకు పందికుంట చేరుకుని అక్కడ సభలో మాట్లాడారు. తరువాత మార్గం
మధ్యలో రామాంజనేయులు అనే రైతు జొన్న విత్తనాలు వేస్తుంటే.. షర్మిల
అక్కడికివెళ్లి వారితోపాటు విత్తనాలు వేశారు. మల్లికార్జున, అంపమ్మ అనే
రైతులు తమ వేరుశనగ పంటలో కాయ కాయక నష్టపోయామని తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు.
మధ్యాహ్నం 3.30కు ఎన్‌ఎన్‌పీ తండా వాసులు తమకు రాజశేఖరరెడ్డి భూములకు
పట్టాలు ఇచ్చారని, ఆ తరువాత ఇక పట్టించుకున్న నాథుడే లేరని చెప్పుకొచ్చారు.
‘జగనన్నను ఎప్పుడు ఇడుస్తారమ్మా.. ఇడవకపోతే మేం కూడా ధర్నా చేస్తాం..’ అని
గొంతెత్తారు.
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వర్షం కురవగా
వర్షంలోనే వజ్రకరూర్ చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
అనంతరం 6.45కు వజ్రకరూర్‌లో ఏర్పాటుచేసిన రాత్రి బసకు చేరుకున్నారు. 19వ
రోజు మొత్తం 10.70 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 246.80
కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. సోమవారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి,
ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, తోపుదుర్తి
కవిత, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, కర్నూలు,
వైఎస్సార్ జిల్లాల కిసాన్‌సెల్ కోఆర్డినేటర్ వై.మధుసూదన్‌రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యలు పరిష్కరిస్తాడన్న నమ్మకం ప్రజలకు ఏ
కోశానా
లేదని జగన్ సోదరి షర్మిల
అన్నారు. అందుకే తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు తమకు
వినతిపత్రాలు ఇస్తున్నారని చెప్పారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 19వ
రోజు సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్‌లో ఆమె
ప్రసంగించారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానికి వంతపాడుతున్న
ప్రతిపక్ష టీడీపీ వైఖరికి నిరసనగా చేపట్టిన
పాదయాత్రలో అడుగడుగునా తమకు ప్రజలు వినతిపత్రాలు ఇవ్వడంపై మాట్లాడారు.
‘‘ముఖ్యమంత్రి అంటారట. మేం ఎందుకు పాదయాత్ర
చేస్తున్నామని.. మాకు ప్రజలు అర్జీలు ఇచ్చుకుంటే, వినతిపత్రాలు ఇచ్చుకుంటే
ఏం లాభమని ఆయన అన్నారట. మీకు విశ్వసనీయత లేదు గనుక మీకు అర్జీలు
ఇచ్చుకున్నా ఈ జన్మలో నెరవేరుతాయన్న నమ్మకం ప్రజలకు లేదు. అందుకే మేం
వెళ్లినప్పుడు మాకు అర్జీలు ఇస్తే.. కనీసం మేం అధికారంలోకి వచ్చినప్పుడైనా
నెరవేరుస్తామన్న నమ్మకం వారికి ఉంది. అందుకే వారు మాకు వినతిపత్రాలు
ఇస్తున్నారు. కేవలం అధికారం ఉంటే సరిపోదు ముఖ్యమంత్రి గారూ.. చిత్తశుద్ధి
ఉండాలి. విశ్వసనీయత ఉండాలి..’’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు.
‘‘నేనీరోజు
చెబుతున్నా ముఖ్యమంత్రి గారికి.. మరణించిన రాజశేఖరరెడ్డి గారు సమాధానం
చెప్పుకోలేరని తెలిసి.. కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, మానవత్వం కూడా
లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా చేర్చింది. కానీ
మూడేళ్లు గడిచిపోయినా.. వైఎస్సార్‌ను ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అదీ
ఆయనకున్న విశ్వసనీయత. జగనన్నను అన్యాయంగా జైలు పాలు చేశారు. దోషి అని
రుజువు చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జగనన్న జైల్లో ఉన్నప్పటికీ
ప్రజలు కిరణ్‌కుమార్‌రెడ్డి మాకు వద్దు.. చంద్రబాబు మాకు వద్దు..
మాకు రాజన్న కొడుకే కావాలి.. మాకు జగనన్న ముఖ్యమంత్రిగా కావాలని
కోరుకుంటున్నారంటే.. అదీ జగనన్నకు ఉన్న విశ్వసనీయత’’ అని షర్మిల అన్నారు.
‘‘చంద్రబాబుకు
తన పరిపాలనను మళ్లీ తెస్తానని చెప్పుకొనే ధైర్యం లేదు. వైఎస్ ఐదేళ్లలో ఏం
చేశారో అవే చేస్తానని ఇప్పుడు చంద్రబాబు చెప్పుకొంటున్నారు. రాజశేఖరరెడ్డి
రుణమాఫీ చేసినట్టే తానూ చేస్తానని చెప్పుకొంటున్నారు. ఉచిత
విద్యుత్తు ఇచ్చినట్టే తానూ ఇస్తానని చెబుతున్నారు. ఫీజు
రీయింబర్స్‌మెంట్ ఇచ్చినట్టే తానూ ఇస్తానంటున్నారు. పదవి ఉన్నప్పుడు ఏమీ
చేయకుండా రాజశేఖరరెడ్డిని తిట్టుకుంటూ.. ఇప్పుడు మాత్రం రాజశేఖరరెడ్డి
పాలనను అందిస్తానని చెప్పకనే చెబుతున్నారు.
అసలు మీకు పాదయాత్ర చేసే అవసరమే లేదు. మీకు, మీ పార్టీకి, మీ పాదయాత్రకు
చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలను ఇంత కష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకు
దించేయడం లేదు? ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు? ’’ అని షర్మిల
చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌కైనా, టీడీపీకైనా కావాల్సింది
అధికారమని, అందుకోసం వారు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు
ఇప్పుడు కొత్తగా పాదయాత్ర అంటూ డ్రామా ఆడుతున్నారు. తన పాలనలో శ్మశానాలుగా
మార్చిన ఆ గ్రామాల నుంచే పాదయాత్ర చేస్తున్నారు’’ అని విమర్శించారు.
కాంగ్రెస్,
తెలుగుదేశం పార్టీల కుట్రల ఫలితం గానే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలు
కెళ్లారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పి నట్లు నడుచుకోకపోవడం వల్లే
జగనన్నను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు.
షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉరవకొండ నుండి ప్రారం భమై
వజ్రకరూర్ మండలం రాగుల పాడు వరకు కొన సాగింది. రాగుల పాడులో రాత్రి
నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్,
టీడీపీలు తప్ప మూడో పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు నీచమైన
కుట్రలకు పాల్పడుతున్నాయని ఆమె నిప్పులు చెరిగారు. హంద్రీనీవా ప్రాజెక్టు
నిర్మాణ పనులను ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు. చంద్రబాబుపై ఆమె విమర్శల
వర్షం కురిపించారు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలను చేధించు కుని త్వరలోనే
జగన్ బయటికి వస్తారని షర్మిల అన్నారు.
ప్రజల బాధలు పట్టని ప్రభుత్వ వైఖరికి.. దానికి మద్దతుగా ఉన్న టీడీపీ
కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా .జగన్ చెల్లెలు షర్మిల చేపట్టిన ‘మరో
ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం 18వ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో
సాగింది. పాదయాత్రలో ప్రజల సమస్యలను ఆమె తెలుసుకున్నారు. ఉదయం ఉరవకొండ
మార్కెట్ యార్డులో బయలుదేరిన షర్మిలకు మార్గమధ్యంలో చిన్నహోతూరుకు చెందిన
గొర్రెల కాపరి సురేష్ ఎదురయ్యాడు. షర్మిలతో తన గోడును వెళ్లబోసుకున్నాడు.
‘రాజన్న లేడు. మేం దిక్కులేనివాళ్లమయ్యాం. ఆయన తెచ్చిన గొర్రెలు మేకల పెంపకందారుల సమాఖ్య
ఆయనతోనే పోయింది. రుణాలు లేవు. గొర్రెలు చస్తే బీమా రాదు. మమ్మల్ని పట్టించుకునేవాళ్లే లేరు’ అని మొర పెట్టుకున్నాడు. "
గొర్రెలు చనిపోతే బీమా రావడం లేదమ్మా. ఇంతకుముందు గొర్రెకు రూ.18 కడితే..
చనిపోయినప్పుడు రూ.1,000 వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. ఏవైనా రోగాలు వచ్చినప్పుడు వాటికి మందులు, చికిత్స అందుబాటులో లేవు.
ఎక్కువగా కుంటు వ్యాధి వస్తుంది. ఇంతకుముందు మందుల సరఫరా బాగుండేది. ఇప్పుడు మందులు దొరకడం లేదు.
రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాకు కార్పొరేషన్(గొర్రెలు, మేకల
పెంపకందారుల సమాఖ్య) ఉండేది. దాని ద్వారా రుణాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు
రాజశేఖరరెడ్డి లేరు. ఆ కార్పొరేషనూ లేదు" అని అతగాడు చెప్పాడు.ఇందుకు స్పందించిన షర్మిల మాట్లాడుతూ
" ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ పోవడానికే సరిపోతోంది. ఇక మీ
గురించి ఆయనేం పట్టించుకుంటారు? వ్యవసాయం బాగాలేనప్పుడు రైతులు
ప్రత్యామ్నాయ ఆదాయం పొందాలని రాజన్న పశువుల పెంపకం కోసం లోన్లు ఇచ్చాడు.
గొర్రెలు, మేకల పెంపకం దారులకు బీమా వసతి కల్పించాడు. కానీ ఈ ప్రభుత్వానికి
అంతటి పెద్ద మనసేది? కిరణ్‌కుమార్‌రెడ్డి లాగానే అధికారులు కూడా
ఉన్నారు. జగనన్న సీఎం కాగానే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు బీమా
అందుతుంది. పశుగ్రాసం, నీటికి కొదవుండదు. వైద్యం కోసం సంచార వైద్యశాలలు
అందుబాటులోకి తెస్తాడు. రుణాలూ ఇస్తాడు. కార్పొరేషన్ బాగా పనిచేసేలా
చూస్తాడు. ధైర్యంగా ఉండండన్నా."
అంటూ భరోసా ఇచ్చారు. .
మరో ప్రజాప్రస్థానం 17వ రోజు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ
కేంద్రానికి చేరడంతో షర్మిల వెంట జన ఉప్పెన కదిలింది. శనివారం ఉదయం లత్తవరం
సమీపం నుంచి ఉదయం గం.11.15కు పాదయాత్ర మొదలవగా.. అడుగడుగునా జనం బారులు
తీరి ఆమెకు స్వాగతం పలికారు. ఉరవకొండ సమీపంలోకి రాగానే పాదయాత్రకు
వేలాది మంది స్వాగతం పలికారు. భోజన విరామ అనంతరం 3.30కు వేలాది మంది జనం
కదం కలపగా షర్మిల ఉరవకొండ వీధుల్లో పాదయాత్ర చేశారు. సాయంత్రం 5.45కు
బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న షర్మిల, విజయమ్మ భారీ సభలో ప్రసంగించారు.
భారీ వర్షంలో తడుస్తూనే రాత్రి 7.35కు మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన
రాత్రి బసకు చేరుకున్నారు. శనివారం 10 కి.మీ. మేర పాదయాత్ర సాగింది.
ఇప్పటివరకు పాదయాత్ర 223.60 కిలోమీటర్లు పూర్తయింది. శనివారం పాదయాత్రలో
ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, మాజీ
ఎమ్మెల్యే ప్రసాదరాజు, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఉరవకొండ
ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన బహిరంగ
సభలో ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి తల్లిని కలిసేందుకు లత్తవరం
సమీపంలో బస చేసిన చోటుకు వచ్చారు. వారిద్దరూ తల్లితో పాటు మధ్యాహ్న భోజన
విరామం వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నారు. 12.40కి
కాసేపు వర్షం కురవగా వర్షంలోనే వారు కూడా పాదయాత్ర చేశారు.
'ఎర్రన్నాయుడు ప్రమాదానిగురైనప్పుడు 108కు 11 సార్లు
ఫోన్ చేసినా పలకలేదట. మరో ప్రైవేటు అంబులెన్స్ వచ్చినా దాంట్లో ఆక్సిజన్
లేక ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయనే కాదు. ప్రతి ప్రాణం ముఖ్యం. కానీ ఈ
ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రతి పథకాన్నీ నిర్వీర్యం చేస్తోంది.
నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం చోద్యం చూస్తోంది. ఆ బాధ్యతను చంద్రబాబు
విస్మరించారు. చంద్రబాబు నిద్రపోతుంటే.. కిరణ్‌కుమార్‌రెడ్డి మొద్దు
నిద్రపోతున్నారు. ఇద్దరూ ఇద్దరే. జోడీ బాగా సరిపోయింది..’ అంటూ
ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలపై షర్మిల నిప్పులు చెరిగారు. ‘మరో
ప్రజాప్రస్థానం’ 17వ రోజు శనివారం పాదయాత్రలో భాగంగా
ఉరవకొండలో జరిగిన భారీ సభలో ఆమె ప్రసంగించారు.
‘‘ఉరవకొండ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులు.వైఎస్ ను గుర్తు తెచ్చుకుంటే నేతన్నలు నేసిన తెల్లటి బట్టలు
గుర్తొస్తాయి. చిరునవ్వు జ్ఞాపకమొస్తుంది. నేతన్న అంటే రాజన్నకు,
జగనన్నకు చాలా ప్రీతి. చంద్రబాబు హయాంలో నేతన్నలను పట్టించుకోకపోవడంతో వందల
మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. రాజన్న
ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు హయాంలో చనిపోయిన నేతన్నల కుటుంబాలకు లక్షన్నర
పరిహారం ఇచ్చి ఆదుకున్నాడు. నేతన్నలకు నడుములు వంగిపోతున్నాయని, కంటిచూపు
దెబ్బతింటోందని 50 ఏళ్లకే పెన్షన్ వచ్చే ఏర్పాటుచేశాడు. వాళ్ల అప్పులు
తీరిపోవాలని రుణమాఫీ కోసం రూ. 312 కోట్లు బడ్జెట్లో కేటాయించాడు. కానీ ఈ
ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని చెల్లించలేదు. ఈరోజు నేతన్న కుటుంబం పనికి
వెళితే ఆ భార్యాభర్తలకు ఇద్దరికీ రోజుకు రూ. 70 కూడా గిట్టడం లేదట. రోజంతా
కష్టపడితే వచ్చే ఈ డబ్బులతో ఆ కుటుంబం ఎలా గడిచేది? పవర్‌లూమ్స్
పెట్టుకుందామంటే కరెంటు ఇవ్వరు. ఇది వారి పొట్టమీద కొట్టడం కాదా?’’ అని
షర్మిల నిలదీశారు.
చంద్రబాబుకు లేనిదీ, రాజన్న,
జగనన్నలకు ఉన్నదీ మాట మీద నిలబడే నైజమని! ప్రజలకు తెలుసు.. చంద్రబాబుకు
లేనిదీ, రాజన్న, జగనన్నలకు ఉన్నది విశ్వసనీయత అని! చంద్రబాబు ఒక
ఇంటర్వ్యూలో అడిగారట. విశ్వసనీయత అంటే ఏమిటని? నాకు ఆశ్చర్యమనిపించింది.
ఆయనకు విశ్వసనీయత అంటే తెలియకపోవడమేంటి? విశ్వసనీయత అంటే పిల్లలకు
తల్లిదండ్రుల మీద ఉండే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు సొంత బిడ్డలా
తమను చూసుకుంటాడన్న నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయతీపరుడు, మాట
ఇస్తే నిలబడతాడు.. మడమ తిప్పడు అనే నమ్మకం. విశ్వసనీయత అంటే చంద్రబాబుకు ఈ
జన్మలో అర్థం కాదు’’ అని షర్మిల అన్నారు. ‘‘పాదయాత్ర చేయాల్సిన అవసరమే
ఆయనకు లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దింపేయడానికి కావాల్సినంత బలం
ఆయనకుంది. కానీ అవిశ్వాసం పెట్టడట. ఈ ప్రభుత్వాన్ని దింపడట. పెంచి
పోషిస్తాడట’’ అని విమర్శించారు.