అమ్మకు తోడుగా ...
మరో ప్రజాప్రస్థానం 17వ రోజు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ
కేంద్రానికి చేరడంతో షర్మిల వెంట జన ఉప్పెన కదిలింది. శనివారం ఉదయం లత్తవరం
సమీపం నుంచి ఉదయం గం.11.15కు పాదయాత్ర మొదలవగా.. అడుగడుగునా జనం బారులు
తీరి ఆమెకు స్వాగతం పలికారు. ఉరవకొండ సమీపంలోకి రాగానే పాదయాత్రకు
వేలాది మంది స్వాగతం పలికారు. భోజన విరామ అనంతరం 3.30కు వేలాది మంది జనం
కదం కలపగా షర్మిల ఉరవకొండ వీధుల్లో పాదయాత్ర చేశారు. సాయంత్రం 5.45కు
బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న షర్మిల, విజయమ్మ భారీ సభలో ప్రసంగించారు.
భారీ వర్షంలో తడుస్తూనే రాత్రి 7.35కు మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన
రాత్రి బసకు చేరుకున్నారు. శనివారం 10 కి.మీ. మేర పాదయాత్ర సాగింది.
ఇప్పటివరకు పాదయాత్ర 223.60 కిలోమీటర్లు పూర్తయింది. శనివారం పాదయాత్రలో
ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, మాజీ
ఎమ్మెల్యే ప్రసాదరాజు, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఉరవకొండ
ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన బహిరంగ
సభలో ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి తల్లిని కలిసేందుకు లత్తవరం
సమీపంలో బస చేసిన చోటుకు వచ్చారు. వారిద్దరూ తల్లితో పాటు మధ్యాహ్న భోజన
విరామం వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నారు. 12.40కి
కాసేపు వర్షం కురవగా వర్షంలోనే వారు కూడా పాదయాత్ర చేశారు.
No comments:
Post a Comment