Friday 16 November 2012

"గ్యాస్" భారం మోపి పిల్లల కడుపు కొడుతున్నారు

"గ్యాస్ మీద భారం మోపి ఈ ప్రభుత్వం పిల్లల కడుపుమీద కొడుతోంది....హాస్టల్లో నెలకు 18 చొప్పున ఏడాదికి 216 సిలిండర్లు దాకా వాడాల్సిన అవసరముంటే.. వాటిలో ఆరు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తుందట. మిగిలినవి ఒక్కో సిలిండరూ రూ.1,250 పెట్టి కొనుక్కోవాలట. ఎంత అన్యాయమిది? అసలే పిల్లలకు రోజుకు రూ.17 మాత్రమే భోజనానికి వెచ్చిస్తుంటే.. ఇప్పుడు గ్యాస్ పేరుతో ఆ భోజనంలో కూడా కోత పెట్టే పరిస్థితి. రూ. 17తో అసలు పిల్లలకు రెండు పూటలా భోజనం ఎలా సరిపోతుంది? జైల్లో ఖైదీలకు కూడా రూ. 45 వెచ్చిస్తుంటే.. పిల్లలకు రూ. 17 మాత్రమేనా? ఇది అన్యాయం కాదా? అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికి ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయో కనుక్కోవాలి..’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల మండిపడ్డారు. ప్రజల శ్రేయస్సును గాలికి వదిలేసి కుమ్మక్కైన కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలకు నిరసనగా జగన్‌ తరఫున షర్మిల  చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 29వ రోజు గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో సాగింది. పెద్దకడబూరు దాటాక క స్తూర్బా బాలికల విద్యాలయంలో షర్మిల విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు ఉండడం లేదని, కాంపౌండ్ వాల్ లేదని, ప్లేగ్రౌండ్ లేదని, గ్యాస్ ధర పెరిగిందంటూ మెనూలో కోతపెడుతున్నారంటూ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన షర్మిల గ్యాస్ పేరుతో పిల్లల పొట్ట మీద కొట్టడం అమానవీయమని అన్నారు. పాలు, గుడ్లు, అల్పాహారం అందుతున్నాయా? అని అడగడంతో పాలు ఇవ్వరని, గుడ్లు వారానికి మూడు ఇస్తారని విద్యార్థినులు తెలిపారు. పదో తరగతితో ఆపకుండా పెద్ద చదువులు చదవాలని, జగనన్న సీఎం అయ్యాక ఎంత పెద్ద చదువైనా ఉచితంగా చదివిస్తాడని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కలెక్టర్‌తో మాట్లాడి క్రీడామైదానం వచ్చేలా చూస్తారని షర్మిల హామీ ఇచ్చారు.గురువారం యాత్రలో ఉదయం రంగాపురం శివారులో బయలుదేరిన షర్మిలకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజానీకం అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...