Monday 29 October 2012

కాంగ్రెస్‌, టిడిపిలకు జగన్‌ అంటే గుబులు

కాంగ్రెస్‌, టిడిపిలకు వైఎస్‌ జగన్‌ అంటే గుబులు పుట్టుకుందని, అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, ఆ పార్టీలకు ప్రజలు గుణపాఠం నేర్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన ఆమె పలు చోట్ల మాట్లాడారు. రాప్తాడు వద్ద రాత్రి జరిగిన బహిరంగసభలో షర్మిల, ఆమె తల్లి విజయమ్మలు మాట్లాడారు. రాజశేఖర్‌రెడ్డి బతికున్న కాలంలో రాష్ట్రంలో రైతులు, చేనేతలు, మహిళలు, విద్యార్థులు అన్ని రకాల బాగుపడ్డారని గుర్తుచేశారు. రాజన్న మృతిచెందిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ జగన్‌పై వ్యక్తిగతంగా కక్ష పెంచుకుందని, అక్రమకేసులు బనాయించి జైలుకు పంపిందని ఆరోపించారు. అధికార పక్షంతో ప్రతిపక్ష పార్టీ కూడా కుమ్మక్కయిందని విమర్శించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విద్యుత్‌ ఛార్జీలు చెల్లించని పేదరైతులపై కేసులు బనాయించి జైలుకు పంపారని, బియ్యం ధర పెంచారని, బెల్ట్‌ షాపుల సూత్రధారి అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు అమలుకు నోచుకోని హామీలిస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. "మనసులోమాట "పుస్తకంలో చంద్రబాబు నిజాలను రాసుకున్నాడని చెప్పారు. రాజన్న రాజ్యంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ఉంటుందని, వడ్డీలేని రుణాలిస్తామని, జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని షర్మిల వివరించారు. జగన్‌ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఉచిత విద్యుత్‌ అందకుండా పోయిందని, పావలావడ్డీ అందటం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని, పింఛన్లు, రేషన్‌కార్డుల్లో కోతలు పెట్టారని ఆవేదన చెందారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు మరికొన్ని రోజులు బెయిలు రాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని, ఇందుకు సాక్ష్యంగా కేంద్ర  మంత్రి చిదంబరాన్ని టిడిపి ఎంపిలు కలవడమే నిదర్శనమన్నారు. జగన్‌ బయటికి వస్తే తమ ఉనికి ఉండదనే భయంతో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో వారికి గుణపాఠం చెప్పాల్సిందిగా ప్రజలను  కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు తోపుదుర్తి కవిత, శంకరనారాయణ, విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి భాస్కరరెడ్డి, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...