Tuesday 30 October 2012

బాబుది మాటమీద నిలబడే నైజం కాదు.....షర్మిల

రాజన్న, జగనన్నలకు ఉన్నది.. టీడీపీ అధినేత చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత, మాటమీద నిలబడే నైజం అని షర్మిల పేర్కొన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 12వ రోజు సోమవారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘‘చంద్రబాబుకు అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే శక్తి టీడీపీకి ఉంది. వైఎస్సార్‌సీపీ కూడా మద్దతు ఇస్తామంటున్నా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరట. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయి. సీబీఐని వాడుకుని విచారణ పేరుతో జగనన్నను బందీని చేశారు. వారి లక్ష్యం ఒక్కటే. జగనన్న బయటే ఉంటే ప్రతి సమస్యకూ స్పందిస్తాడు. రేయనక పగలనక మీ మధ్య ఉంటాడు. మీ ప్రేమ, ఆప్యాయతలు పొందుతాడు. కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు. ఇలాగైతే తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని వారు జగనన్నను దోషిగా చిత్రీకరించారు. జైల్లో పెట్టారు. కానీ దేవుడున్నాడు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన నిలబడతాడన్నదీ అంతే నిజం. అధర్మానికి ఆయుష్షు తక్కువ’’ అన్నారు.
‘‘కరువు జిల్లా అని అనంతపురంపై ప్రత్యేక శ్రద్ధతో రాజన్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని 4 వేల కోట్ల రూపాయలతో చేపట్టి 95% పనులు పూర్తిచేస్తే.. ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం 5% కూడా పూర్తిచేయలేకపోయింది. ఇంకో రూ.45 కోట్లు వెచ్చిస్తే మొదటి విడత పనులు పూర్తవుతాయి. ఈ పనుల కోసం మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేసి పూర్తి చేస్తారట. సొమ్మొకరిది.. సోకొకరిది అన్న చందంగా ఉంది ఆయన కథ. పోనీలెండి. ఆ పనులైనా పూర్తిచేస్తే సంతోషమే..’’ అని షర్మిల విమర్శించారు.  ‘‘జగనన్న అధికారంలోకి వస్తే పెద్ద చదువులకు ఇక ఆటంకం ఉండదు. ప్రతి మహిళా తన పిల్లలను బడికి పంపేందుకు వీలుగా ‘అమ్మ ఒడి’ ద్వారా తల్లి బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ.500, ఇంటరైతే రూ.700, డిగ్రీ అయితే రూ.1,000 వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 పింఛన్ ఇస్తాడు. రాజన్న చెప్పినవీ చేశాడూ.. చెప్పనివీ చేశాడు. జగనన్న కూడా మాట మీద నిలబడే మనిషి. చెప్పినవే కాకుండా ప్రజల అవసరాలను గమనించి అన్నీ సమకూరుస్తాడు. మైనారిటీలకు వీలైనంత ప్రయోజనం కల్పించాలన్నదే వైఎస్ లక్ష్యం. అదే లక్ష్యంతో జగనన్న పనిచేస్తాడు..’’ అని చెప్పారు.కోటి ఎకరాలకు నీరివ్వాలన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలను జగనన్న సాకారం చేస్తాడని చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి, రైతన్న గిట్టుబాటు ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాడని పేర్కొన్నారు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తాడని అన్నారు.
బహిరంగ సభలో లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ కారణజన్ముడని పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలు రుద్దే నేతలు మనల్ని పాలించడం సరికాదన్నారు. డిసెంబర్‌లోగా జగన్ బయటికి వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, ఢిల్లీలో కూడా కాంగ్రెస్, బీజేపీల తరువాత 35 ఎంపీ స్థానాలతో అతి పెద్ద పార్టీ వైఎస్సార్‌సీపీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...