
ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, పాదయాత్ర పేరుతో నాటకాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల విమర్శించారు. ‘ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలి. కానీ పెట్టరు. ప్రభుత్వం పడిపోతే జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయనకు భయం..’ అని దుయ్యబట్టారు. ఆరో రోజు మంగళవారం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె పలు చోట్ల ప్రసంగించారు. ‘రైతులు కష్టాల కడలిలో ఉంటే చంద్రబాబు పాలించిన 9 ఏళ్లలో సాగునీటికి కనీసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేయలేదు. అదే రైతు పక్షపాతి రాజన్న 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు మనసులోని మాటను ఆయనే పుస్తక రూపంలో బయటపెట్టుకున్నారు. వ్యవసాయం దండగ అని రాసుకున్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దని, ఇస్తే సోమరిపోతులు అవుతారని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమని రాసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో ఎల్లో డ్రామాలు ఆడుతూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. కరువు కోరల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలులో పెట్టింది మీరు కాదా చంద్రబాబూ? వారింట్లో సామాను లాగేసుకుంది మీరు కాదా? మీ హయాంలో 4 వేల రైతు ఆత్మహత్యలు నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది మీరు కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవడం నిజం కాదా? ఇంకా ఎందుకు నాటకాల పాదయాత్రలు?’ అని షర్మిల ధ్వజమెత్తారు.
No comments:
Post a Comment