Monday 22 October 2012

జడివానలోనూ పాదయాత్ర..



ఆదివారం పులివెందుల నుంచి లోపట్నూతల వరకు 16.2 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో మహిళలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లి విజయమ్మ, వదిన వైఎస్ భారతిలతో కలసి షర్మిల చేసిన ఈ పాదయాత్రలో ఉదయం నుంచి భోజన విరామం వరకు దాదాపు 10 వేల మంది కదం తొక్కారు. వీరిలో దాదాపు ఏడెనిమిది వేల మంది మహిళలే!! భోజన విరామం కంటే ముందు చిన్నకుడాల క్రాస్‌రోడ్డు వద్దకు పొద్దుటూరు నుంచి దాదాపు 2,500 మంది మహిళలు తమ పిల్లలను వెంటేసుకుని వచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపారు. వీరిలో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ‘నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుకు ధైర్యం రాలేదు. నాన్న ముఖ్యమంత్రి అయ్యాక పరిహారం ఇచ్చారు. రూ. 200 కోట్ల రుణాలు మాఫీ చేశారు. మరో రూ. 312 కోట్ల రుణమాఫీకి జీవో కూడా జారీ చేసినా.. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దాన్ని అమలుచేయలేదు. ఇంతకుముందు ఎవరూ చేయలేని ఆలోచన నాన్న చేశారు. చేనేత కార్మికులు మగ్గాల మీద పనిచేస్తున్నప్పుడు కంటిచూపు దెబ్బతింటుందన్న ఆవేదనతో వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. జగనన్న సీఎం అయ్యాక ఆ పెన్షన్ రూ. 1,000కి పెరుగుతుంది..’ అని పేర్కొన్నారు. జడివానలోనూ ఆగని పాదయాత్ర..
సాయంత్రం లింగాలవైపు పాదయాత్ర సాగుతుండగా 6 గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది. లింగాల మూడు కిలోమీటర్లు ఉందనగా వర్షం జడివానగా మారింది. అదే వర్షంలో షర్మిల ముందుకు సాగారు. షర్మిలతోపాటే పాదయాత్రలో ఉన్న అభిమానులంతా ముందుకు సాగారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి తోటలు కొట్టేస్తున్న తరుణంలో ఇప్పుడు వర్షాలు రావడం స్థానికులకు ఆనందాన్ని కలిగించింది. ‘వర్షం వస్తే రాజన్న వచ్చినట్టే ఉంది..’ అని స్థానికులు అనడం వినిపించింది.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...