Saturday 20 October 2012

ఇది ముందుచూపు లేని సర్కార్...షర్మిల


పేదల గోడు పట్టని ప్రభుత్వంపై, ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై  వైఎస్ తనయ షర్మిల నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే ముందుచూపు కూడా లేదని, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే మళ్లీ రాజన్న పాలన రావాలని, అది జగనన్నతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. రైతన్నలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు, మహిళలతో మమేకమవుతూ శుక్రవారం వైఎస్సార్ జిల్లాలో షర్మిల రెండోరోజు ‘మరో ప్రజాప్రస్థానం’ కొనసాగించారు. వెళ్లిన ప్రతిచోటా జనం షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరెంటు కష్టాలు.. పింఛను వెతలు.. ఫీజుల వేదన.. ఇలా అనేక సమస్యలను ఆమెతో పంచుకున్నారు. వైఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఉదయం 9.50కి వేంపల్లి సమీపంలోని రాజీవ్‌నగర్ వద్ద పాదయాత్ర ప్రారంభమైంది.
యాత్ర ముందుకు సాగుతుండగా.. సయ్యద్ బీబీ అనే మహిళ తన బాధలు వివరించింది. వైఎస్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నానని, ఇప్పుడు నిలువ నీడైతే ఉంది గానీ కరెంటు బిల్లులతో, కరెంటు కోతలతో నిద్రే కరువైందని విలపించింది. ఇందుకు జగనన్న తొందర్లోనే మీ ముందుకు వస్తాడని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని చెబుతూ షర్మిల ఆమెను ఊరడించారు. అక్కడి నుంచి ముందుకు సాగుతుండగా వృద్ధ మహిళలు చాలామంది ఎదురొచ్చారు. రాజశేఖరరెడ్డి వల్లే తనకు పెన్షన్ వచ్చిందని ఒకరు.. మూడేళ్లుగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటూనే ఉన్నా ఇవ్వడం లేదని మరొకరు చెప్పారు. ‘‘చంద్రబాబు ఉన్నప్పుడు బియ్యం కార్డు ఉంటేనే సంఘంలో చేరనిచ్చేవారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాక అందరం చేరాం. పావలా వడ్డీ పథకం అందింది. కానీ ఇప్పుడు మాతో బలవంతంగా వడ్డీ కట్టించుకుంటున్నారు..’’ అని మరికొందరు మహిళలు షర్మిల ముందు ఆవేదన వ్యక్తంచేశారు.
మార్గమధ్యంలో కత్తులూరు పంచాయతీ మహిళలు షర్మిలకు ఎదురేగి స్వాగతం పలికారు. ‘‘మాకు సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయి. కనీసం తాగునీరు కూడా లేదు. కరెంటైతే అసలే ఉండడం లేదు..’’ అని వాపోయారు. ఈ సందర్భగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కరెంటు ఎందుకు ఉండడం లేదో మీకు తెలుసా? ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని తెలుసు. కరెంటు సమస్య ఉందనీ తెలుసు. మరి కరెంటు ఎందుకు కొనుగోలు చేయలేదు. పొరుగు రాష్ట్రాలు ముందే కొనుక్కుని అక్కడ పరిశ్రమల పరంగా ఎలాంటి నష్టం లేకుండా ముందుకు వెళుతుంటే.. పారిశ్రామికంగా దూసుకుపోతుంటే.. ఇక్కడ మన ముఖ్యమంత్రి పరిశ్రమలను నెలలో సగం రోజులు మూసేసుకోమంటున్నారు. అలా అయితే వాటిలో పనిచేసే కార్మికులు ఏం కావాలి? వారి కుటుంబాలు ఏం కావాలి? మీరే చెప్పండి.. ఏం చేద్దాం? వైఎస్ ఉన్నప్పుడు ముందుచూపుతో విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించాలని తలపెడితే.. ఇప్పుడేమో ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ కూడా తేలేని పరిస్థితిని తెచ్చింది ఈ ప్రభుత్వం.. ఈ పాలకులకు రైతులంటే ఎంత నిర్లక్ష్యమో తెలుస్తోంది.. వాళ్లకు కావాల్సింది సీఎం కుర్చీ. ఢిల్లీకి వెళ్లి రావడం. టీడీపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దు..’’ అని మండిపడ్డారు. వికలాంగుడైన తన మనవడికి పెన్షన్ ఇవ్వడం లేదని ఓ వృద్ధురాలు విలపించగా.. ‘‘జగనన్న సీఎం అయితే కనీసం రూ.600లకు తగ్గకుండా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నాడు.. అధైర్యపడకమ్మా.. మీకు ధైర్యం చెప్పేందుకే జగనన్న నన్ను పంపాడు..’ అని భరోసా ఇస్తూ షర్మిల ముందుకు కదిలారు.


 

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...